వరల్డ్ కప్2019: ధావన్ రిప్లేస్‌మెంట్..పంత్‌కు పిలుపు

ICC World Cup 2019, వరల్డ్ కప్2019: ధావన్ రిప్లేస్‌మెంట్..పంత్‌కు పిలుపు

చేతి వేలి గాయం కారణంగా శిఖర్ ధావన్ మూడు వారాల పాటు ప్రపంచ కప్ మ్యాచ్‌లకు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్లేయర్స్‌లో రిషబ్ పంత్‌కు బోర్డు నుంచి పిలుపు వచ్చింది. వీలైనంత త్వరగా ఇంగ్లండ్‌కు రావాలని, టీమిండియాతో చేరాలని రిషబ్‌కు బీసీసీఐ అధికారులు సూచించారు. అయితే శిఖర్ ధావన్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జట్టు అవసరాల మేరకు తుది జట్టులోకి పంత్‌ను తీసుకోవడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది.

అనుభవజ్ఞుడైన అంబటి రాయుడి కంటే ఐపీఎల్, అంతకు ముందు వన్డే సిరీస్‌లలో మంచి ఫామ్‌ను చాటుకున్న యువ ఆటగాడు రిషబ్ పంత్‌పైనే బీసీసీఐ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది. శిఖర్ ధావన్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్‌కి దిగనున్నట్లు తెలుస్తోంది. దీంతో దినేష్ కార్తిక్ లేదా విజయ్ శంకర్‌లలో ఎవరో ఒకరు కేఎల్ రాహుల్ స్థానంలో నెం.4లో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. తదుపరి రెండు మ్యాచ్‌లు భారత్‌కు కీలకం కానున్నాయి. వరల్డ్ కప్‌లో మంచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన గురువారం తలపడనుండగా…ఆదివారం చిరకాల ప్రత్యర్థి జట్టు పాక్‌ను ఢీకొననుంది.

ఇదిలా ఉండగా శిఖర్ ధావన్‌కు ఇంగ్లండ్‌లోనే విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల తర్వాత కోలుకున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయితే జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే గాయం తీవ్రత దృష్ట్యా ధావన్ వరల్డ్ కప్‌కు పూర్తిగా దూరమయ్యే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *