తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ కుక్కల దాడులు. ముఖ్యంగా తెలంగాణలో చిన్నారులపై కుక్కలు చేస్తున్న దాడులు భయాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయి. సాధారణంగా కుక్కులు అనగానే మంచి పెంపుడు జంతువులుగానే అందరూ పరిగణిస్తారు. మంచి విశ్వాసాన్ని చూపుతాయని భావిస్తారు. ఇది కూడా నిజమే. ఇంట్లో పెంచుకొనే కుక్కులు మీకు మంచి స్నేహితుడిగా ఉండగలవు. కానీ వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరించే కుక్కలే ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే వారిని చుట్టుముడుతున్నాయి. బండిపై వెళ్తున్న వారిపైకి ఎగబడుతున్నాయి. నిజంగా అదొక భయానక అనుభవం. మరి వీటి నుంచి రక్షణ పొందడం ఎలా? గుంపులుగా వీధి కుక్కలు మీ పైకి వచ్చినప్పుడు మీరు చేయాల్సిందేమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రండి..
మిమ్మల్ని వీధి కుక్క తరుముతోంది అనుకోండి. మీరు మొదటిగా ఉండాల్సిందేమిటంటే ప్రశాంతంగా ఉండటం. కుక్కలు మనుషులు భయపడుతున్నట్లు గ్రహిస్తే అవి మరింత దూకుడుగా దాడి చేస్తాయి. అలాగే ఆ కుక్క కళ్లలోకి అస్సలు చూడకూడదు. అలా చూస్తే అవి వాటికీ ఏదో ముప్పు వాటిల్లినట్లు భావించి, దాడి చేస్తాయి. మీరు కుక్కవైపు చూడకుండా, ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి.
కుక్క మీ దగ్గరకు రావడం ప్రారంభిస్తే మీరు నెమ్మదిగా వెనక్కి మళ్లాలి. అలా అని కుక్కను చూసి పారిపోకూడదు. అప్పుడు అది మీ వెంట పడుతుంది. దాన్ని చూసి భయపడినట్లుగా కూడా ఉండకూడదు. మిమ్మిల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటూ వెనక్కి మళ్లడానికి ట్రై చేయాలి.
మీకు సమీపంలో చెట్టు, బెంచ్ లేదా చెత్త డబ్బా వంటి ఏదైనా వస్తువు ఉంటే, దానిని మీకు, కుక్కకు మధ్య అడ్డుగా పెట్టుకోడానికి ప్రయత్నించండి. ఇది కుక్క మిమ్మల్ని దాడి చేయకుండా కాపాడుతుంది.
మీరు వెనక్కి వెళ్లి అడ్డంగా ఏదైనా వస్తువు పెట్టుకున్నా కూడా కుక్క మీ మీదకి వస్తున్నట్లు మీరు భావిస్తే బిగ్గరగా ఏదైనా శబ్దాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఛాయ్ వెళ్ళిపో! అని అరవొచ్చు. లేదా బైక్ పై ఉంటే హారన్ మోగించవచ్చు. అప్పుడు అవి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది.
కుక్క మీపై దాడి చేస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించండి. ఇందులో కర్ర, రాయి వంటిది ఏదైనా. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దాన్ని ఉపయోగించండి. కుక్క ముక్కు లేదా తలపై కొట్టడానికి ప్రయత్నించండి. మీరు కిందపడిపోతే మీ తల, మెడను కుక్కకు అందకుండా మీ చేతులతో కాపాడుకోండి.
ఎంతలా ప్రయత్నించినా కుక్క దాడి చేసిందే అనుకోండి.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చిన్న గాయం అయినా వైద్యునికి చూపడం అవసరం. ఎందుకంటే కుక్క కాటు ద్వారా రేబిస్ సోకుతుంది. ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..