
అన్నాన్ని వండిన తర్వాత ఎలా నిల్వ చేస్తున్నామనేది చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. చివరకు అదే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం కావచ్చు. మరి అన్నాన్ని మళ్లీ వేడి చేయడం ఎందుకు ప్రమాదకరం? ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి? మిగిలిన అన్నాన్ని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
బియ్యంలో సహజంగానే బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియా స్పోర్స్ ఉండే అవకాశం ఉంది. అన్నం వండిన తర్వాత కూడా ఈ బ్యాక్టీరియా బీజాలు సజీవంగా ఉండవచ్చు. వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు బయట ఉంచితే ఈ బ్యాక్టీరియా వేగంగా పెరిగి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తుంది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్నాన్ని మళ్లీ వేడి చేసినంత మాత్రాన ఇప్పటికే ఏర్పడిన హానికరమైన టాక్సిన్స్ పూర్తిగా నశించవు. దీంతో ఆ అన్నం తిన్నవారికి ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
బ్యాక్టీరియా కలుషితమైన అన్నాన్ని తినడం వల్ల వాంతులు, వికారం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు ఈ లక్షణాలు అన్నం తిన్న కొద్ది గంటల్లోనే కనిపించవచ్చు. శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
అన్నం వండిన తర్వాత దానిని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. వీలైనంత త్వరగా చల్లార్చి, ఒక గంటలోపు ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. గాలి చొరబడని శుభ్రమైన డబ్బాలో నిల్వ చేయాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన అన్నాన్ని కూడా 24 గంటల్లోపు ఉపయోగించడం మంచిది. బయట ఎక్కువసేపు ఉంచిన కొద్దీ అందులో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్నం మిగిలిందని నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు.
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన అన్నాన్ని తినాలనుకున్నప్పుడు అవసరమైన పరిమాణాన్ని మాత్రమే బయటకు తీసుకోవాలి. ఆవిరి వచ్చేంత వరకు, కనీసం 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరేలా పూర్తిగా వేడి చేయాలి. అన్నం మొత్తం సమానంగా వేడయ్యేలా చూసుకోవాలి.
ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉన్న మొత్తం అన్నాన్ని బయటకు తీసి వేడి చేసి, మిగిలిన దానిని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇలా పదేపదే చల్లార్చడం, వేడి చేయడం వల్ల ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఒక్కసారి తినడానికి సరిపడా అన్నాన్ని మాత్రమే వేడి చేసుకోవాలి.
అన్నం వండిన వెంటనే గంటల తరబడి బయట ఉంచడం, రాత్రంతా వంటగదిలోనే వదిలేయడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టిన అన్నాన్ని కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. ఒకసారి వేడి చేసిన అన్నాన్ని రెండోసారి మళ్లీ వేడి చేయకుండా చూసుకోవాలి.
మొత్తానికి అన్నం మిగిలిపోతే దానిని ఎలా పడితే అలా నిల్వ చేయకూడదు. సరైన సమయంలో ఫ్రిజ్‌లో పెట్టడం, అవసరమైనంత మాత్రమే బయటకు తీసుకోవడం, పూర్తిగా వేడి చేసి తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ చిన్న విషయాలను గుర్తుంచుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం ఆహార భద్రతపై అవగాహన కోసం మాత్రమే. అన్నం నిల్వ చేసే సమయంలో సమయం, ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా నిల్వ చేయని అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినకూడదు.