Iron Deficiency: మహిళల్లో ఐరన్ లోపం ఎందుకు వస్తుంది? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Iron deficiency in women: మహిళల్లో ఐరన్ (ఇనుము) లోపం పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న వారిలో అధిక శాతం మహిళలే కావడం గమనార్హం. ముఖ్యంగా కిషోర వయసు అమ్మాయిలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ఉరుకుల పరుగులు జీవితంలో చాలా మందికి నిద్రతోపాటు సరైన ఆహారం కూడా తీసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదు. అది కూడా సమయానికి తినడం లేదు. పురుషుల సంగతి పక్కన పెడితే.. మహిళలు మాత్రం తీసుకునే ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ చూపకపోవడంతో పోషకాహారం లోపంతో వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ (ఇనుము) లోపం పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్న వారిలో అధిక శాతం మహిళలే కావడం గమనార్హం. ముఖ్యంగా కిషోర వయసు అమ్మాయిలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
ఐరన్ అంటే ఏమిటి?
ఐరన్ మన శరీరంలో హీమోగ్లోబిన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. హీమోగ్లోబిన్ రక్తం ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది. ఐరన్ తక్కువైతే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక అలసట, బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి.
మహిళల్లో ఐరన్ లోపానికి ప్రధాన కారణాలు
నెలసరి సమయంలో అధిక రక్తస్రావం.. ప్రతి నెలా వచ్చే మాసిక ధర్మం కారణంగా మహిళలు సహజంగానే ఐరన్ కోల్పోతుంటారు. ఎక్కువ రోజులు లేదా ఎక్కువగా రక్తస్రావం జరిగే వారికి ఐరన్ లోపం మరింత పెరుగుతుంది.
పోషకాహార లోపం.. ఐరన్ ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడటం, ఆకుకూరలు, పప్పులు తినకపోవడం ప్రధాన కారణాలు.
గర్భధారణ, పాలిచ్చే కాలం.. గర్భధారణ సమయంలో తల్లి నుంచి బిడ్డకు ఎక్కువ ఐరన్ అవసరం అవుతుంది. సరైన పోషకాహారం లేకపోతే తల్లిలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలు.. గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా ఐరన్ శోషణ తగ్గుతుంది.
పరాన్నజీవి సంక్రమణలు.. కొన్ని రకాల పురుగులు (హుక్‌వార్మ్ లాంటి) రక్తాన్ని పీల్చి ఐరన్ లోపానికి కారణమవుతాయి.
ఐరన్ లోపం లక్షణాలు, సమస్యలు
ఎప్పుడూ అలసటగా అనిపించడం చర్మం పసుపు లేదా తెల్లగా మారడం తల తిరగడం, తలనొప్పి గుండె వేగంగా కొట్టుకోవడం జుట్టు రాలడం ఊపిరి తక్కువగా రావడం దృష్టి కేంద్రీకరించలేకపోవడం ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
ఐరన్ లోపాన్ని ఎలా తీర్చాలి?
ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి..
శాకాహారులులైతే.. పాలకూర, తోటకూర, మెంతికూర, శెనగపప్పు, కందిపప్పు, మినపప్పు, బెల్లం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, నువ్వులను తమ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులులైతే.. కోడి, మేక కాలేయం (లివర్), ఎర్ర మాంసం, చేపలు, గుడ్డు పచ్చసొన తమ ఆహారంలో తీసుకోవాలి.
విటమిన్ C తీసుకోవాలి.. ఐరన్ శరీరంలో బాగా శోషించబడాలంటే విటమిన్ C అవసరం. నిమ్మకాయ, నారింజ, ఉసిరికాయ, టమాటా లాంటి వాటిని ఆహారంతో పాటు తీసుకోవాలి. టీ, కాఫీ తగ్గించాలి.. భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగితే ఐరన్ శోషణ తగ్గుతుంది. కనీసం ఒక గంట గ్యాప్ ఇవ్వడం మంచిది.
వైద్యుల సూచనతో ఐరన్ మాత్రలు.. తీవ్రమైన ఐరన్ లోపం ఉన్నప్పుడు డాక్టర్ సూచనతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. స్వయంగా మందులు వాడటం మంచిది కాదు.
మహిళలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం: ఐరన్ లోపం చిన్న సమస్యలా కనిపించినా దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న అమ్మాయిలు, గర్భిణులు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవడం అవసరమని గుర్తించాలి.
