Dengue: కరోనా కంటే డెంగ్యూ డేంజర్.. బాడీని లోపల నిర్వీర్యం చేస్తోంది..

|

Sep 06, 2024 | 4:28 PM

వర్షాల తర్వాత డెంగ్యూ జ్వరం వేగంగా వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైనది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా రోగి మరణానికి దారి తీస్తుంది. అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాక జ్వరం తగ్గాక కూడా చాలాకాలం పాటు ఇది శరీర భాగాలపై ప్రభావం చూపతుంది.

Dengue: కరోనా కంటే డెంగ్యూ డేంజర్.. బాడీని లోపల నిర్వీర్యం చేస్తోంది..
Dengue
Follow us on

దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ మధ్య డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల వస్తుంది. డెంగ్యూ సోకిన వ్యక్తి తీవ్రమైన జ్వరంలో బాధపడతారు. సకాలంలో చికిత్స చేయకపోతే, రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ సోకిన వెంటనే.. డాక్టర్లు రిఫర్ చేసిన మెడిసిన్ వాడి.. డైట్ ఫాలో అయితే.. వ్యాధి నుంచి బయటపడొచ్చు. అయితే వ్యాధి ప్రభావం వ్యక్తిని ఎక్కువ కాలం ఇబ్బందులు పెడుతోంది. నీరసం, జాయింట్ పెయిన్స్ వంటివి ఉంటాయి. అంతేకాదు డెంగ్యూ జ్వరం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఒక పరిశోధన వెల్లడించింది.

కొత్త అధ్యయనంలో ఏం తేలిందంటే..

కోవిడ్-19తో పోలిస్తే డెంగ్యూ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 55 శాతం ఎక్కువగా ఉందని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో 11,700 మందికి పైగా డెంగ్యూ రోగులు, 12 లక్షల మందికి పైగా కోవిడ్ -19 రోగుల డేటాను విశ్లేషించారు. 

కోవిడ్-19 కంటే డెంగ్యూ ప్రమాదకరం

నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ మోడలింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లిమ్ జు టావో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ అత్యంత సాధారణ వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులలో ఒకటి అని.. దాని వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. మీడియా కథనాల ప్రకారం, మహారాష్ట్ర, ఢిల్లీ సహా దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా నివేదిక అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.

డెంగ్యూ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది

ఇప్పటి వరకు, దేశంలో పెరుగుతున్న గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల కేసులకు కోవిడ్-19 ప్రధాన కారణంగా కొందరు వైద్యులు అనుమానిస్తున్నారు. కోవిడ్ -19 తర్వాత గుండెపోటు కేసులు పెరిగాయని డేటా చెబుతోంది. అయితే గుండె జబ్బుల విషయంలో.. కోవిడ్ -19 కంటే డెంగ్యూ చాలా ప్రమాదకారి అని చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. రానున్న కాలంలో గుండె జబ్బులకు డెంగ్యూ కూడా ప్రధాన కారణంగా పరిగణించబడే రోజులు వస్తాయంటున్నారు. 

సింగపూర్‌కు చెందిన ఈ శాస్త్రవేత్తలు డెంగ్యూ బారిన పడిన తర్వాత, గుండె ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, డెంగ్యూ భవిష్యత్తులో శరీరంపై చాలా తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అనేక సందర్భాల్లో, తీవ్రమైన డెంగ్యూ కాలేయం దెబ్బతినడం, మయోకార్డిటిస్, నరాల సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.

డెంగ్యూ తర్వాత గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెంగ్యూ కారణంగా  రక్తస్రావం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం వల్ల అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది రోగులలో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, న్యూరోలాజికల్ డిజార్డర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని 213 శాతం పెంచుతుంది. డెంగ్యూ అనేది దోమ కాటు ద్వారా ప్రజలలో వ్యాపిస్తుందని తెలిసిన విషయమే.  

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.