కాస్ట్లీ కార్లు, కోట్లల్లో ఆస్తులు.. కానీ ఆ తప్పులతో కన్నబిడ్డలకు కనీసం అన్నం కూడా పెట్టలేని స్థాయికి పడిపోయాడు
వెండితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎందరో హాస్యనటుల నిజజీవితాలు ఒక్కోసారి కన్నీటి సంద్రాలను తలపిస్తాయి. అలాంటి ఒక అత్యంత విషాదకరమైన జీవనగాథ అలనాటి సీనియర్ హాస్యనటుడు వల్లూరి బాలకృష్ణది. 1951లో వచ్చిన పాతాళభైరవి చిత్రంలో అంజిగాడు పాత్రతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ నటుడి జీవితం వైభవం నుండి దయనీయ స్థితికి ఎలా పడిపోయిందో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

వల్లూరి బాలకృష్ణ 1925లో ఏలూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో సన్నగా ఉండటంతో స్నేహితులు ఆయన్ని ఆటపట్టించేవారు. చదువు అబ్బకపోవడంతో కేవలం ఐదో తరగతితో చదువు ఆపివేసి నాటకరంగం వైపు అడుగులు వేశారు. తన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌తో నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో రాణించాలనే కసితో చేతిలో పైసా లేకపోయినా టికెట్ లేకుండా రైలెక్కి కలకత్తా చేరుకున్నారు. అక్కడ తిండి కూడా లేక తీవ్రమైన ఆర్థిక కష్టాలు అనుభవించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తండ్రి, సంగీత దర్శకుడు కోటికి తాతయ్య అయిన సాలూరి సన్యాసిరాజు, బాలకృష్ణలోని ప్రతిభను గుర్తించి ఆశ్రయం ఇచ్చారు. అవకాశాల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగారు.
వల్లూరి బాలకృష్ణ జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం పాతాళభైరవి. 1951లో కే.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ పక్కన అంజిగాడు పాత్రకు ఎంపికయ్యారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్-బాలకృష్ణల కాంబినేషన్, వారి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, అంజిగాడు పాత్ర అప్పట్లో ఎంతలా పాపులర్ అయిందంటే, అప్పటి నుండి ఆయనను అందరూ అంజిగాడ్రోయ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో మాంత్రికుడి శిష్యుడిగా నటించిన పద్మనాభం తెరపై శత్రువుగా కనిపించినప్పటికీ, నిజజీవితంలో బాలకృష్ణకు ప్రాణ స్నేహితుడు అయ్యాడు. బాలకృష్ణ నటనను చూసే ఆ తర్వాత కాలంలో రాజబాబు వంటి హాస్యచక్రవర్తి ఇండస్ట్రీకి వచ్చారని చెబుతారు. పాతాళభైరవి విజయం తర్వాత బాలకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాటి స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, కాంతారావుల చిత్రాలలో ఆయన తప్పనిసరి అయ్యారు. ముఖ్యంగా జానపద చిత్రాల బ్రహ్మ బి.విఠలాచార్య సినిమాలలో బాలకృష్ణ లేనిదే కథ ముందుకు నడిచేది కాదు. విజయ సంస్థ నిర్మించిన అనేక క్లాసిక్ చిత్రాలలో ఆయన భాగమయ్యారు. మాయాబజార్లో ఉత్తరకుమారుడికి చెలికాడుగా ఆయన చేసిన నటన సజీవంగా నిలిచిపోయింది. ఒక దశలో పద్మనాభం కంటే బిజీయెస్ట్ కమెడియన్‌గా మారిన బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో కేవలం 15 రూపాయలు పారితోషకం తీసుకుంటే, ఆ తర్వాత అది ఏకంగా 15,000 రూపాయలకు పెరిగింది. షూటింగ్లకు అత్యంత ఖరీదైన కార్లలో రావడం, రాచరికపు విలాసాలతో బ్రతకడం ఆయనకు అలవాటుగా మారింది.
అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైభవం నెత్తికెక్కిన వేళ మనుషులు చేసే పొరపాట్లే వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. బాలకృష్ణకు ఏడుగురు ఆడపిల్లలు జన్మించారు. ఇల్లంతా మహాలక్ష్ములతో కళకళలాడుతుందని మొదట ఎంతో గర్వపడినప్పటికీ, ఆయనకున్న కొన్ని చెడ్డ అలవాట్లు ఆ సంసారాన్ని రోడ్డున పడేశాయి. విపరీతమైన మద్యపానం, నమ్మిన వారి కోసం ఆస్తులు తాకట్టు పెట్టి హామీలు ఇవ్వడం వల్ల ఆయన ఆస్తులు కరిగిపోవడం మొదలైంది. దీనికి తోడు పరోక్షంగా కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశారు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు అవ్వడంతో భారీ నష్టాలు చవిచూశారు. సహాయం అని వచ్చిన వారికి లేదు అనకుండా చేతికి ఎముక లేకుండా దానం చేయడం కూడా ఆయన ఆర్థిక పతనానికి ఒక కారణం అయ్యింది. మద్యానికి బానిస అవ్వడం వల్ల షూటింగ్లకు ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు షూటింగ్లు రద్దు అవ్వడంతో ఇండస్ట్రీలో ఆయనపై చెడ్డపేరు వచ్చింది. ఇదే సమయంలో కొత్త హాస్యనటుల రాకతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
80వ దశకం వచ్చేసరికి వల్లూరి బాలకృష్ణ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మద్రాసులో ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులన్నీ అప్పులు తీర్చడానికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఖరీదైన కార్లలో తిరిగిన ఆ మహానటుడు చివరి రోజుల్లో ఒక చిన్న అద్దె గదిలోకి మారిపోయి, చిన్నచిన్న వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగారు. తన ఏడుగురు ఆడపిల్లలకు రోజుకు మూడు పూటల కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితికి ఆయన చేరుకున్నారు. “నాడు కాస్ట్లీ కార్లలో తిరిగాను, నేడు నా బిడ్డలకు కనీసం అన్నం కూడా పెట్టలేకపోతున్నాను” అని రాత్రులు నిద్రపట్టక ఒంటరిగా కుమిలిపోతూ ఏడ్చేవారట. తీవ్రమైన మానసిక ఆందోళన, ఆకలి కష్టాల మధ్య నలిగిపోతూ చివరిసారిగా బలిదానం అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1982లో ఒకరోజు తీవ్రమైన మనస్తాపంతో హఠాత్తుగా కుప్పకూలి ఈ లోకాన్ని విడిచారు. ఆయన మరణ వార్త విని ప్రాణ స్నేహితుడు పద్మనాభం కన్నీరుమున్నీరయ్యారు. బాలకృష్ణ కడసారి చూపుకు కూడా ఎవరూ లేని అపన్న స్థితిలో పద్మనాభమే దగ్గరుండి అంత్యక్రియల ఖర్చు భరించి తన స్నేహితుడికి సాగనంపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




