
అమృతం సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయి. అయితే, ఈ సీరియల్ వెనుక దర్శకుడు ఎస్.ఎస్. కాంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సృజనాత్మక పరిష్కారాలతో ముందుకు సాగారు. ఆయన మాటల్లోనే, అమృతం సీరియల్ చాలా తక్కువ బడ్జెట్‌లో రూపొందిందని, ఇది నటుల ఎంపికలో తీవ్రమైన ఇబ్బందులను సృష్టించిందని తెలుస్తుంది. మంచి నటులను పిలవాలంటే, అప్పట్లో ఒక్క రోజుకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉండేది. అందంగా కనిపించే, కాస్త అనుభవం ఉన్న నటీమణులకు రెండు వేల నుండి మూడు వేల వరకు అడగేవారని అన్నారు. ఈ బడ్జెట్ పరిమితుల కారణంగా, ఎస్.ఎస్. కాంచి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. “ఇలాగైతే మనకు అవ్వదు” అని గ్రహించి, తన అసిస్టెంట్ డైరెక్టర్లందరినీ నటులుగా మార్చారు. ఉదాహరణకు, వాసు అనే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వం అనే ముఖ్యమైన పాత్రను పోషించారు. అలాగే, కాంచి తన క్లాస్‌మేట్ రమా వత్సలను ఒక పాత్ర చేయాల్సిందిగా కోరారు. తన పిల్లలు, కిమ్స్ భాస్కర్ రావు గారి పిల్లలు, గురువా రెడ్డి గారి పిల్లలు వంటి కుటుంబ సభ్యులను కూడా చిన్న పిల్లల పాత్రల్లో నటింపజేశారు. వీరే కాకుండా, దారిలో షూటింగ్ చూడటానికి వచ్చిన వారిని, చివరికి సెట్ బాయ్‌లను కూడా అవసరాన్ని బట్టి నటులుగా ట్ వాడేశారట.
ముఖ్యంగా, అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న హను రాఘవపూడి ఒక సంక్రాంతి ముగ్గుల పోటీ ఎపిసోడ్ కోసం తన కాలనీలోని మహిళామణులను తీసుకువచ్చిన సంఘటన ఎంతో ఆసక్తికరమైనది. వృత్తిపరమైన నటులతో కూడా సాధ్యం కాని సహజత్వాన్ని ఆ మహిళలు అందించారని కాంచి గుర్తు చేసుకున్నారు. కెమెరామెన్ రామును కూడా ఒక రాఖీ ఎపిసోడ్లో నటింపజేశారు. ఈ విధంగా, అమృతం సెట్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నటులుగా మారారు. రమా వత్సలను ఒకప్పుడు జీ ఆల్ఫా, జీ తెలుగు ఛానళ్లలో న్యూస్ రీడర్ గా చూసిన విషయాన్ని కూడా కాంచి పంచుకున్నారు.
అమృతం ప్రయాణం తర్వాత, ఎస్.ఎస్. కాంచి దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాఘవేంద్ర రావు గారి వద్ద పని చేసిన తర్వాత, తనకంటూ డబ్బు సంపాదించి, తన కథలను ఎవరి జోక్యం లేకుండా తనే డైరెక్ట్ చేయాలనే తపనతో ఉన్నానని తెలిపారు. కానీ, ఆ మార్గంలో ఎదురుదెబ్బలు తగిలాయని, డబ్బు సంపాదించడం కుదరలేదని వివరించారు. అమృతం సినిమాగా చేయాలనుకున్నా కుదరలేదని, రాజమౌళి సింహాద్రి తర్వాత బిజీ అవ్వడం, మర్యాద రామన్న తర్వాత సబ్జెక్టు రెడీ చేసుకున్నా హీరోలను ఒప్పించలేకపోవడం వంటి అనేక కారణాలతో తన దర్శకుడిగా మొదటి సినిమా ఆలస్యమైందని చెప్పారు. చివరకు తాను నమ్మిన ఒక కథతో సినిమా చేసినా, నిర్మాత పరిమితుల వల్ల అది విడుదల కాకుండానే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.