
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే సినిమాల్లో ‘వారణాసి’ మొదటి స్థానంలో ఉంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న వారణాసి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వారణాసి సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో థియరీలు కనిపిస్తున్నాయి. కాగా వారణాసి కథపై రాజమౌళి ఇప్పటికే కొంచెం హింట్ ఇచ్చారు. ప్రస్తుతంతో పాటు రాముడు జీవించిన త్రేతాయుగం సీన్స్ కూడా ఉండనున్నాయని ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. అలాగే మహేశ్.. శ్రీరాముడిగానూ కనిపించనున్నాడుని క్లియర్ గా చెప్పేశారు. ఈ నేపథ్యంలో వారణాసి సినిమా స్టోరీ ఇదేనంటూ నెట్టింట పలు థియరీలు కనిపిస్తున్నాయి. వీటి ప్రకారం.
రామాయణంలోని కుంభకర్ణుడే పునర్జన్మ ఎత్తి విలన్ కుంభ(పృథ్వీరాజ్ సుకుమారన్)గా మారతాడట. కాలు కూడా కదపలేని ఇతడు.. తన సోదరుడు రావణుడికి చెందిన నవ రత్నాలు ఎలాగైనా సొంతం చేసుకోవాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. వీటిని సొంతం చేసుకుంటే అపారమైన శక్తి లభిస్తుందని కుంభ నమ్మకం. రామ-రావణ యుద్ధం జరిగినప్పుడు ఈ నవరత్నాఉ చెల్లాచెదురు అయిపోయి వేర్వేరు దేశాల్లోకి వెళ్లిపోతాయి. కుంభ కదల్లేడు కాబట్టి వాటిని తీసుకురమ్మని రుద్ర(మహేశ్ బాబు)ని పంపిస్తాడు. ఈ క్రమంలోనే మహేష్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆ రత్నాల కోసం అన్వేషణ సాగిస్తాడు. ఇదే క్రమంలోనే రుద్ర.. రామాయణం జరిగిన కాలంలోకి ప్రయాణిస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. రత్నాలు దక్కించుకుంటున్న టైంలో రుద్రకి కుంభ అసలు లక్ష్యమేంటో తెలుస్తుంది. ఆ తొమ్మిది రత్నాలూ ఒక్కటిగా చేరితే ‘కుంభ’కు ఎవరూ ఎదిరించలేని అపారమైన అసుర శక్తులు లభిస్తాయని, అది యావత్ సృష్టికి పెను విపత్తుగా మారుతుందని రుద్ర గ్రహిస్తాడు. దీంతో కుంభ ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు గతంలోకి (త్రేతాయుగానికి) వెళ్లి, రామ-రావణ యుద్ధ సమయంలో చోటుచేసుకున్న ఒక కీలక ఘట్టాన్ని అడ్డుకుంటాడు. తద్వారా ఆ నవరత్నాల హారం విడిపోకుండా చేసి, భవిష్యత్‌ను సైతం సమూలంగా మార్చేసే ప్రయత్నం చేస్తాడు. రామాయణం వంటి ప్రాచీన ఇతిహాసానికి సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్టులో జోడించి రాజమౌళి వారాణాసి సినిమాను తెరకెక్కించారని సమాచారం. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది అధికారికం కానప్పటికీ ఒక వేళ ఇదే నిజమైతే బాబు సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి