ప్రముఖ భాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. సినిమా రంగంలో గొప్ప విజయాలు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తోంది. ఇప్పుడు ఈ అవార్డు మిథున్ చక్రవర్తిని వరించింది. 74 ఏళ్ల వయసులో ఈ అవార్డు రావడం పట్ల అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మిథున్ సినిమా ప్రయాణం నిజంగా ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ కమిటీ మిథున్ చక్రవర్తికి ఈ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది. మిథున్ ఇండియన్ సినిమాకు చేసిన సేవల ఆధారంగా ఈ అవార్డును అందించనున్నారు అని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక అక్టోబర్ 8న జరగనుంది. ఈ వేడుకలో మిథున్ చక్రవర్తిని అవార్డుతో సత్కరించనున్నారు. ఇక మిథున్‌కి బాలీవుడ్‌తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష మిథున్ చక్రవర్తికి అభినందనలు తెలిపారు. విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం! తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు. మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది- అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ‘డిస్కో కింగ్’. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను అని బాలయ్య అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.