AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణ స్నేహితుడి మరణం.. చివరి చూపు కూడా దక్కలేదని ఎమోషనల్ అయిన మురళీమోహన్

సీనియర్ నటుడు గిరిబాబు మరణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. ఆయన సన్నిహిత మిత్రుడు, ప్రముఖ నటుడు మురళీమోహన్ ఈ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, సహనటుడు గిరిబాబును కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మురళీమోహన్ ఎమోషనల్ అయ్యారు.

ప్రాణ స్నేహితుడి మరణం.. చివరి చూపు కూడా దక్కలేదని ఎమోషనల్ అయిన మురళీమోహన్
Muralimohan
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2026 | 9:42 AM

Share

1973లో అట్టూరి పురుషోత్తమరావు గారు నిర్మించిన జగమేమాయ చిత్రం ద్వారా గిరిబాబుతో తన నట ప్రస్థానం ప్రారంభమైందని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా గిరిబాబుకు, తనకు ఇద్దరికీ మొదటి చిత్రం. నిజానికి, ముందుగా గిరిబాబునే హీరోగా ఎంపిక చేయడం జరిగింది. అయితే, మురళీమోహన్ ఫోటోలు చూసిన తర్వాత, ఆయనే హీరో అయితే బాగుంటుందని భావించి, గిరిబాబును విలన్ పాత్ర చేయమని కోరారు. అందుకు గిరిబాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, క్యారెక్టర్ ఏదైనా చేస్తానని చెప్పి, చాలా స్పోర్టివ్‌గా అంగీకరించారు. ఆనాటి నుంచి మొదలైన వారి పరిచయం, ఆ తర్వాత అపురూప స్నేహబంధంగా మారింది. వారిద్దరూ సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలసి ఉండేవారని, కుటుంబ సభ్యులు సైతం ఎంతో స్నేహంగా మెలిగేవారని మురళీమోహన్ తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా గిరిబాబు అనారోగ్యంతో మంచాన పడ్డారని మురళీమోహన్ బాధపడ్డారు. ఒకరోజు ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు, ఎంతసేపు పలకరించినా తనను గుర్తుపట్టలేకపోవడం, కళ్ళు కలపలేకపోవడం తనను చాలా కలచివేసిందని గుర్తు చేసుకున్నారు. తర్వాత కొంతసేపటికి “గడ్డం పెంచుతున్నావేంటయ్యా” అని గిరిబాబు తనను గుర్తుపట్టారని తెలిపారు. చిన్న కొడుకు, పెద్ద కొడుకుతో పాటు కోడలు కూడా గిరిబాబును కన్నతండ్రిలా జాగ్రత్తగా చూసుకున్నారని ప్రశంసించారు. అయితే, హాస్పిటల్‌లో ఉన్న విషయం తెలియక, మరుసటి రోజు చూద్దామని అనుకునేలోపే గిరిబాబు మరణించడం తనను మరింత బాధించిందని మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాలలో ఉన్నందున ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని వివరించారు.

గిరిబాబు స్థాపించిన జయభేరి సంస్థను మురళీమోహన్‌కు ఇవ్వడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గిరిబాబు మూడు సినిమాలు డైరెక్ట్ చేసి, రెండు సినిమాలు నిర్మించిన తర్వాత, మూడో సినిమాకు మురళీమోహన్‌ను హీరోగా పెట్టి చిత్రీకరణకు వెళ్లారు. అప్పుడు క్లాప్ బోర్డుపై మాధవి చిత్ర అని ఉండటంతో, జయభేరిని ఏం చేశావని అడిగితే, అది వదిలేశానని గిరిబాబు చెప్పారట. ఆ పేరు తనకు చాలా ఇష్టమని, దానిని తనకు ఇస్తే దానిపై సినిమాలు నిర్మిస్తానని మురళీమోహన్ కోరగా, గిరిబాబు సంతోషంగా ఆ పేరును అందించారు. ఆ బ్యానర్‌పై మురళీమోహన్ తీసిన మొదటి సినిమా వారాల అబ్బాయి. అందులో గిరిబాబు విలన్‌గా, మురళీమోహన్ హీరోగా నటించారు. జయభేరి బ్యానర్‌పై మురళీమోహన్ దాదాపు 25 సినిమాలు నిర్మించారని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో కూడా జయభేరి పేరును ఉపయోగించి విజయం సాధించారని పేర్కొన్నారు.

తమ సంస్థ నిర్మించిన 25 చిత్రాలలో దాదాపు 15 చిత్రాలలో గిరిబాబు నటించారని మురళీమోహన్ తెలిపారు. గిరిబాబు ఒక ఆల్ రౌండర్ నటుడని, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేయగల సామర్థ్యం ఉందని కొనియాడారు. జయభేరి సంస్థలో సినిమా కథలు ఎంపిక చేసేటప్పుడు గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ వంటి వారి అభిప్రాయాలు తీసుకునేవారని, గిరిబాబు సలహాలు ఎంతో విలువైనవని తెలిపారు. పదేళ్ల క్రితం భార్య మరణించినప్పటి నుంచి గిరిబాబు మానసికంగా డల్ అయిపోయారని, ఆరోగ్యం కూడా అప్పటి నుంచే క్షీణించడం ప్రారంభమైందని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. గిరిబాబు కుమారుడు రఘుబాబు మంచి కమెడియన్‌గా, నటుడిగా రాణించడం పట్ల గిరిబాబు చాలా సంతోషించేవారట. గిరిబాబు 600కు పైగా సినిమాల్లో నటించి, మూడు సినిమాలకు దర్శకత్వం వహించారని, సొంత కథలతో సినిమాలు తీశారని మురళీమోహన్ తెలిపారు. ఒక మంచి స్నేహితుడిని, ఆల్ రౌండర్ నటుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. ఎవరితోనూ వైరం లేకుండా, అందరితో స్నేహంగా ఉండే గిరిబాబు ఆత్మకు శాంతి కలగాలని మురళీమోహన్ ఆ భగవంతుడిని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us