
దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ (తెలుగులో జన నాయకుడు) విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాలోని పలు సీన్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్ అయ్యారు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాని ఈ చిత్రం నుంచి సుమారు 5 నిమిషాల సీన్‌తో పాటు ఒక సాంగ్‌ను లీక్ చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. మూవీ వీడియోలను షేర్ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఇప్పటికే న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి జననాయగన్ సినిమా లీక్ పై స్పందించారు. ఎంతో మంది కష్టానికి ప్రతిరూపమైన సినిమా ఇలా పైరసీ బారిన పడడం శోచనీయమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు ఆన్ లైన్ లో లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతోమంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు సినిమా పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్‌ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం. కిల్ పైరసీ.. సేవ్ సినిమా’ అనిచిరంజీవి పిలుపునిచ్చారు.
మరోవైపు జననాయగన్ సినిమా లీక్ పై ఆ చిత్ర నిర్మాతలు స్పందించారు. ఈ మేరకు కేవీఎన్ నిర్మాణ సంస్థ ఒక లీగల్ నోటీస్ జారీ చేసింది. సినిమాలోని కొన్ని దృశ్యాలు అక్రమంగా లీక్ అయ్యాయని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్రమైన నేరమని జన నాయగన్ నిర్మాతలు స్పష్టం చేశారు. లీక్ అయిన వీడియోలను చూడటం లేదా డౌన్లోడ్ చేయడం, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లలో ఇతరులకు ఫార్వార్డ్ చేయడం లేదా షేర్ చేయడం. యూట్యూబ్ లేదా ఇతర వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. అత్యున్నత టెక్నాలజీ సహాయంతో సినిమాను పైరసీ చేసిన వారిని గుర్తిస్తున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని నిర్మాతలు హెచ్చరించారు.