
ప్రస్తుతం సినీ ప్రేక్షకుల వినోదానికి థియేటర్లు మాత్రమే వేదికగా ఉండటం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, టాక్ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. దీంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్న పలువురు ప్రముఖులు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకులు ఓటీటీ వేదికలపై తమదైన ముద్ర వేయగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. చిరంజీవిని ఓటీటీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయనతో ప్రత్యేకమైన టాక్ షో నిర్వహించేందుకు సదరు ఓటీటీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిరంజీవితో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చర్చలు కొలిక్కి వస్తే త్వరలోనే ఈ ఓటీటీ షోకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై అగ్ర హీరోలు కనిపించడం ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. బాలకృష్ణ ఇప్పటికే అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షోతో డిజిటల్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరోవైపు వెంకటేశ్ రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. మరో వైపు నాగార్జున బిగ్ బాస్ గేమ్ షోతో అటు టీవీ ఇటు ఓటీటీలోనూ దూసుకుపోతున్నారు. దీంతో తమ అభిమాన హీరోలను డిజిటల్ వేదికలపై చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ కోసం ప్రత్యేకమైన టాక్ షో చేయనున్నారని ప్రచారం జరుగుతుంది.
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కాకా చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర కూడా చిరంజీవి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.