Cinema: యో.. చూసుకోబల్లే.. త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! ‘రామయాణం’ కొత్త సినిమాపై భారీగా ట్రోల్స్
ఈ దీపావళికి రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన రామాయణం విడుదల కాకముందే , ఇదే ఇతిహాసం ఆధారంగా మరో చిత్రం థియేటర్లలోకి వచ్చింది. 'మహాకావ్య శ్రీ రామాయణ కథ ' అనే పేరుతో సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రంలో "కచ్చా బాదం" ఫేమ్ అంజలి అరోరా సీత పాత్రలో నటించారు.

రామాయణ, మహాభారతాలు భారతీయులకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవి. ఈ ఇతిహాసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఇక త్వరలోనే నితీష్ తివారీ ‘రామాయణ’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఇందులో రాముడు, సీతగా కనిపించనున్నారు. అయితే ఈ రామాయణ కంటే ముందే ఇదే ఇతిహాసం ఆధారంగా హిందీలోనే ‘మహాకావ్య శ్రీ రామాయణ కథ’ అనే మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నెటిజన్లు ఈ సినిమాను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన వీఎఫ్ఎక్స్ అలాగే నటీనటుల వేషధారణపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘మహాకావ్య శ్రీ రామాయణ కథ’ సెప్టెంబర్ 25న విడుదలైంది. అయితే థియేటర్లలో సినిమా విడుదలకు ముందు, చిత్ర నిర్మాతలు రామాయణంలోని పలు కీలక పాత్రలను పరిచయం చేస్తూ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు . ఈ పోస్టర్లలో శ్రీరాముని తండ్రి, దశరథ మహారాజు, విశ్వామిత్ర మహర్షి, కైకేయి, మంథర, పరశురాముడు, విభీషణుడు, శూర్పణఖ తదితరుల పోస్టర్లను రివీల్ చేశారు. అయితే ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ పోస్టర్లలో ఒక వానర సైనికుడు కళ్లద్దాలు పెట్టుకుని ఉండడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. త్రేతా యుగంలో కూడా కళ్లద్దాలు ఉన్నాయా? అంటూ సినిమాను భారీగా ట్రోల్ చేస్తున్నారు. అసలు దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
‘శ్రీ రామాయణ కథ’ ఏమిటంటే?
‘మహాకావ్య శ్రీ రామాయణ కథ’ స్టోరీ కాస్త భిన్నంగా ఉంటుంది. శశ్వత్ అనే ఒక చిన్న బాలుడికి హనుమంతుడు ఒక ఋషి రూపంలో దర్శనమిచ్చి, శ్రీరాముని సంపూర్ణ జీవిత ప్రయాణాన్ని వివరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రామాయణం లోని భక్తి, సాంస్కృతిక ప్రాముఖ్యతను నేటి యువతరానికి తెలియజేయడమే చిత్ర బృందం లక్ష్యం. ఈ చిత్రంలో దేవ్ శర్మ (శ్రీరాముడు), అంజలి అరోరా (సీత), శీల్ వర్మ (లక్ష్మణుడు), నిర్భయ్ వాధ్వా (హనుమంతుడు), రజనీష్ దుగ్గల్ (రావణుడు) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కథానాయకుడు దేవ్ శర్మ మాట్లాడుతూ తనకు గతంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’, రణబీర్ కపూర్ ‘రామాయణం’ చిత్రాలలో లక్ష్మణుడి పాత్రకు ఆఫర్లు వచ్చాయన్నాడు.
“నేను రెండు పెద్ద సినిమాల్లోనూ లుక్ టెస్ట్ పూర్తి చేసి ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నాను. కానీ ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ కంటే నేను 2 అంగుళాలు పొడవుగా ఉన్నాను. దీంతో నేను కథానాయకుడి కంటే పొడవుగా కనిపించాననే కారణంతో వారు నన్ను తిరస్కరించారు. రామాయణం విషయంలో నాకు అదృష్టం కలిసి రాలేదని చాలా బాధపడ్డాను. అయితే ఇప్పుడు ‘మహాకావ్య శ్రీ రామాయణ కథ’లో రాముడి పాత్ర పోషించే అవకాశం లభించింది’ అని దేవ్ శర్మ చెప్పుకొచ్చాడు.
నెటిజన్ షేర్ చేసిన పోస్ట్..
Treta yug me bhi chashma lagate the 😭 pic.twitter.com/vWsX0L9QJA
— dk (@thefilmyyguyy) September 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




