
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అరుదైన కలయికల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన జై చిరంజీవ సినిమాకు త్రివిక్రమ్ అందించిన కథ, పదునైన మాటలు చిరంజీవి కామెడీ టైమింగ్‌కు తోడై థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యంగా చిరు, బ్రహ్మానందం మధ్య సాగే ట్రాక్ ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన త్రివిక్రమ్, మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం కోసం మాత్రం చాలాకాలంగా వేచి చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌పై పలుమార్లు ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. గతంలో త్రివిక్రమ్‌తో దానయ్యకు ఒక సినిమా చేసే కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని వినియోగించుకుంటూ, మెగాస్టార్‌తో త్రివిక్రమ్‌ను కలిపేందుకు దానయ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ వినిపించిన ఒక ఆసక్తికరమైన కథాంశం చిరంజీవికి బాగా నచ్చడంతో, దాన్ని పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్‌గా సిద్ధం చేయమని మెగాస్టార్ సూచించినట్లు సమాచారం. అయితే ఇటు చిరు, అటు త్రివిక్రమ్ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ మూవీ పైనే ఉంది. ఇటీవల వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రమైన జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో సాగే ఈ భారీ పౌరాణిక చిత్రం ఆగిపోయిందంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ.. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్, నిర్మాతలు కల్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ ముగియగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘కాకా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు చిరు లైనప్‌లో మరికొందరు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, చిరంజీవి- త్రివిక్రమ్- దానయ్య కాంబినేషన్లో సినిమా ఖాయమైతే కనుక, అది ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పూర్తయిన తర్వాతే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే, త్రివిక్రమ్ ఏమైనా మనసు మార్చుకుని గాడ్ ఆఫ్ వార్ కంటే ముందే ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తారా.? లేదా.? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి