కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు హీరో కార్తీ. గతేడాది పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన అతను ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో మరో హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే జపాన్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ కార్తీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇది అతనికి 25వ సినిమా. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జపాన్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినిమా కెరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన జపాన్ ను మరింత స్పెషల్‌గా మార్చుకునేందుకు కార్తీ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారట. తన అన్న సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయాలను విరాళంగా అందజేశారట. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. జపాన్ 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, అలాగే 25 పాఠశాలలకు ఒక్కోదానికి లక్ష రూపాయలు, ఒక్కో ఆస్పత్రికి లక్ష రూపాయల చొప్పున 25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేయనున్నారట. అలాగే మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు 25 వేల మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారట.
సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 25 వేల మందికి అన్నదానం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందట. ఇటీవలే ఉలవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక టీ. నగర్‌లో కార్తీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ‘అన్న సూర్య బాటలోనే తమ్ముడు కూడా’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక జపాన్ సినిమా విషయానికి వస్తే.. కార్తీ ఇందులో దొంగగా నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 12న జపాన్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..