Thalapathy Vijay:ఎంజీఆర్‌ టు దళపతి విజయ్‌.. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారలు.. చరిత్ర ఏం చెబుతుందంటే?

|

Feb 02, 2024 | 9:38 PM

తమిళనాడులో సినిమా-రాజకీయ అనుబంధం ఆంధ్రాలో సినీ రాజకీయాల బంధానికి భిన్నంగా ఉంటుంది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తనకున్న పాపులారిటీతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయాల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. కానీ తమిళనాడులో సినీనటులు రాజకీయాల్లోకి రావడానికి ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణం.

Thalapathy Vijay:ఎంజీఆర్‌ టు దళపతి విజయ్‌.. తమిళనాడు రాజకీయాల్లో సినీ తారలు.. చరిత్ర ఏం చెబుతుందంటే?
Tamil Movie Stars
Follow us on

తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు దగ్గరి సంబంధం ఉంది. అంతేందుకు అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌ లో కూడా ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అయితే తమిళనాడులో సినిమా-రాజకీయ అనుబంధం ఆంధ్రాలో సినీ రాజకీయాల బంధానికి భిన్నంగా ఉంటుంది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తనకున్న పాపులారిటీతోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయాల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. కానీ తమిళనాడులో సినీనటులు రాజకీయాల్లోకి రావడానికి ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణం. అన్నాదొరై (డీఎంకె వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి సీఎం), ద్రవిడ ఉద్యమానికి మూలపురుషుడైన పెరియార్‌తో పాటు ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన కరుణానిధి తమిళనాట సినిమా ప్రస్థానంలో స్క్రీన్ రైటర్‌లుగా, నటులుగా పనిచేశారు. ద్రవిడ ఉద్యమ ఆవశ్యకతను, ఔచిత్యాన్ని సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు తెలియజేసేందుకు ఆయన కృషి చేశారు. స్వతహాగా నటుడైన అన్నాదొరై సినిమాలను ఉద్యమాలకు, రాజకీయాలకు వాడుకున్నారు. అన్నాదొరై దారిలో ద్రవిడ ఉద్యమం పట్ల ఆసక్తి ఉన్న కరుణానిధి, శివాజీ గణేశన్‌లు సినిమాల ద్వారా ద్రవిడ ఉద్యమ ప్రచారంలో పాలుపంచుకున్నారు.

తమిళ సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖులు వీరే..

అన్నాదొరై

అన్నాదొరై మద్రాసు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, అలాగే తమిళనాడు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ద్రవిడ ఉద్యమంలో పెరియార్‌తో గుర్తింపు పొందిన అన్నాదొరై, తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీ అయిన డీఎంకె వ్యవస్థాపకులు కూడా. అన్నాదొరై సినిమాని ఉద్యమానికి, రాజకీయాలకు వాడుకున్నారు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు స్క్రీన్ ప్లే రైటర్‌గా కూడా వర్క్‌ చేశారు.

ఎం కరుణానిధి

ద్రవిడ ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరైన ఎం కరుణానిధి నేరుగా సినిమాల్లో నటించలేదు, కానీ ఆయన అనేక సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు, కథలు సమకూర్చారు. ద్రవిడ ఉద్యమాన్ని తమిళ ప్రజల మదిలోకి తీసుకెళ్లిన ‘పరాశక్తి’ చిత్రానికి ఎం కరుణానిధి స్క్రీన్ ప్లే రాశారు. తమిళనాడు వ్యాప్తంగా ‘పరాశక్తి’ సినిమా కొత్త ఒరవడిని సృష్టించింది. డీఎంకే పార్టీని స్థాపించిన వారిలో కరుణానిధి ఒకరు. కరుణానిధి తమిళనాడు సీఎంగా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

శివాజీ గణేశన్

తమిళ ప్రముఖ నటుల్లో ఒకరైన శివాజీ గణేశన్ ‘పరాశక్తి’ చిత్రంలో కూడా నటించారు. ద్రావిడ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు. డీఎంకే ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరిన శివాజీ తిరుపతి ఆలయాన్ని సందర్శించడంపై విమర్శలు రావడంతో ఆ పార్టీని వీడి తమిళ జాతీయ పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్‌లో విలీనమైంది. తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు కామరాజ్‌కు సన్నిహితుడు అయిన శివాజీ గణేశన్ అనేక ముఖ్యమైన పదవులను అనుభవించారు.

ఎంజీఆర్‌

MG రామచంద్ర తమిళనాడు సినిమాలు, రాజకీయాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. 1953 వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఎంజీఆర్ అన్నాదొరై స్ఫూర్తితో డీఎంకేలోకి వచ్చారు. కానీ అన్నాదొరై మరణం తర్వాత కరుణానిధి డీఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం కూడా అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్‌ను బహిష్కరించారు. తరువాత, MGR తన బంధువు ప్రారంభించిన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ADMK) లో చేరారు మరియు దాని నాయకత్వాన్ని స్వీకరించారు. తర్వాత దాని పేరును ఏఐఏడీఎంకేగా మార్చుకున్నాడు. రెండు సార్లు సీఎం కూడా అయ్యారు. ఆయనకు మరణానంతరం భారతరత్న కూడా లభించింది.

జయలలిత

కన్నడ నటి జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారామె. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైనా తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. జయలలిత తమిళనాడుకు ఆరుసార్లు సీఎంగా ఉన్నారు.

MR రాధ

MR రాధ ప్రముఖ తమిళ నటుడు. నాటకాల ద్వారా పెద్ద పేరు తెచ్చుకున్న ఎంఆర్ రాధ తమిళ చిత్రసీమలో అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన విలన్. ఎంఆర్ రాధా పెరియార్ భావజాలాన్ని అనుసరించేవారు. డీఎంకేలో కూడా గుర్తింపు పొంది కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఎంజీఆర్‌పై కాల్పులకు ప్రయత్నించి జైలుకు వెళ్లాడు.

విజయకాంత్

నటుడు విజయకాంత్ 2005లో పార్టీని స్థాపించారు. 2011లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి. విజయ కాంత్ గతేడాది డిసెంబర్ 28న కన్నుమూశారు.

కమల్ హాసన్

నటుడు కమల్ హాసన్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారాయన. 2018లో కమల్ హాసన్ ‘మక్కల్ నిధి మాయం’ పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ఆయన ఎదుర్కొన్నారు. కానీ గెలవలేదు. ఇప్పటికీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు లోకనాయకుడు.

ఖుష్బు

కన్నడతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బు గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఖుష్బు 2010లో డీఎంకేలో చేరారు. నాలుగేళ్లలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు రాలిగా ఉన్నారు.

దళపతి విజయ్

తమిళ ప్రస్తుత స్టార్ నటుడు దళపతి విజయ్ ఇంతస్తే (ఫిబ్రవరి 2) తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

వీరు కూడా

ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్. ప్రముఖ నటులు కేఆర్ రామస్వామి, ఎంఆర్ కృష్ణన్, నటుడు విశాల్ కూడా రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నవారే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.