ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేసింది. తన గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులను అలరించిన ఆమె గొంతు కోల్పోయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే డాక్టర్ల సహాయంతో తను కోలుకున్నానని.. తను మళ్లీ మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్ తర్వాత తన గొంతు రాలేదని.. కనీసం మాట్లాడేందుకు కూడా వీలు కాలేదని తెలిపింది. అయితే చికిత్స అనంతరం ప్రస్తుతం ఆమె మాట్లాడగల్గుతున్నానని.. ఇటీవలే న్యూయార్క్ లో జరిగిన సంగీత కచేరిలో పాల్గోన్నట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది. సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఏడు నగరాల్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్నారు.
న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్ DC, బే ఏరియా, లాస్ ఏంజిల్స్, ఓర్లాండో మరియు న్యూయార్క్లలో పర్యటన జరిగింది. నవంబర్ 18న, ఓర్లాండోలోని ఎడిషన్ ఫైనాన్షియల్ ఎరీనాలో శ్రేయా ఘోషల్ ప్రదర్శన ఇచ్చింది. అయిత ఈ కచేరీ తర్వాత ఆమె తన గొంతును కోల్పోయినట్లు ఆమె ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది. “ఇది చాలా భావోద్వగమైన రోజు. నేను నా మ్యూజిక్ యూనిట్.. నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. వారు నా చెడు, మంచి సమయాల్లో నాకు మద్దతు ఇచ్చారు.. నాకు అండగా నిలిచారు. నిన్న రాత్రి ఓర్లాండోలో కచేరీ తర్వాత నేను పూర్తిగా నా స్వరాన్ని కోల్పోయాను. నా శ్రేయోభిలాషుల ఆశీస్సులు ప్రార్ధన.. డా. సమీర్ భార్గవ అందించిన చికిత్సతో నేను నా గాత్రాన్ని తిరిగి పొందాను. ఆ తర్వాత న్యూయార్క్ ఎరీనాలో మొత్తం మూడు గంటల కచేరీలో పాల్గొన్నాను” అంటూ ఇన్ స్టా స్టోరీలో తెలియజేశారు.
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో శ్రేయా ఒకరు. తెలుగులోనే కాదు..హిందీ..తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటివరకు శ్రేయా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.