
తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బిగ్‌బాస్ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారుతుంటారు. అయితే ఈ షో అందరికీ ఒకేలా కలిసి రాదు. ఆటతీరు, మాటతీరుతో కొందరు ప్రశంసలు అందుకుంటే, మరికొందరు విమర్శలను ఎదుర్కొంటూనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తారు. అలాంటి జాబితాలో ముందుండే నటీమణుల్లో రతికా రోజ్ ఒకరు. బిగ్‌బాస్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రతికా రోజ్.. చిన్నతనం నుంచే నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె, మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని అవకాశాలు దక్కించుకుంటూ, క్రమంగా సినిమా రంగం వైపు అడుగులు వేసింది.
2020లో విడుదలైన బొమ్మ అదిరింది సినిమాతో రతిక సిల్వర్ స్క్రీన్ ప్రయాణం ప్రారంభమైంది. షకలక శంకర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్!’ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కీలకమైన రోల్ పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో కెరీర్ సాగుతున్న తరుణంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది రతికా రోజ్. హౌస్‌లో ఆమె ఆటతీరు, తోటి కంటెస్టెంట్లతో జరిగిన వివాదాలు, ఎమోషనల్ మూమెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ షో ద్వారా ఆమెకు పాపులారిటీ విపరీతంగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో విమర్శలు, ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లోని టెలివిజన్ ప్రేక్షకులకు ఈ బ్యూటీ సుపరిచితురాలైంది.
బిగ్‌బాస్ తర్వాత ఆమెకు వెండితెరపై ఆశించిన స్థాయిలో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ రకరకాల ట్రెండీ వేర్స్, మోడరన్ అండ్ గ్లామరస్ ఫొటోషూట్లతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆమె షేర్ చేసే కొత్త లుక్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మరి రాబోయే రోజుల్లో రతికా రోజ్ ఎలాంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాల్సిందే.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.