
2013లో ప్రారంభమైన జబర్దస్త్ టీవీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఆదరణ తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ షోను క్రమం తప్పకుండా చూస్తున్నారు. టీవీలో చూడకపోయినా కనీసం యూట్యూబ్ లో జబర్దస్త్ స్కిట్లను చూసి ఎంజాయ్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ జబర్దస్త్ షోకు ఉన్న మరో పాజిటివ్ అంశం ఏమిటంటే.. ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ టీవీ షో.
జబర్దస్త్ టీవీ షోలో కమెడియన్లుగా చేసిన వారిలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. సుడిగాలి సుధీర్, బలగం వేణు, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్, శాంతి కుమార్ తదితర జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. అయితే ఇదే జబర్దస్త్ షోలో ఏళ్ల పాటు ఉండి వందల కొద్దీ స్కిట్స్ చేసి ఆడియెన్స్ ను కడపుబ్బా నవ్వించిన ఒకతను ఇప్పుడు ఆకు కూరలు అమ్ముకుంటున్నాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈవెంట్లకు కూడా వెళుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతను మరెవరో కాదు జబర్దస్త్ లో ఖమ్మం సుజాతగా లేడీ గెటప్పులతో ఆకట్టుకున్న శేఖర్.
శేఖర్ ది తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం. చాలామంది లాగే ఎన్నో ఆశలతో జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడు. మొదట హైపర్ ఆది సహాయంతో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. ఆతర్వాత వెంకీ మంకీ టీంలో చాలా ఏళ్ల పాటు ఉన్నాడు.
ఖమ్మం సుజాతగా విభిన్నమైన లేడీ గెటప్పులు వేస్తూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. సుమారు ఏడేళ్ల కాలంలో దాదాపు 300 కు పైగా ఎపిసోడ్స్ చేశాడు శేఖర్. అయితే క్రమంగా అవకాశాలు తగ్గిపోవడం, దీనికి తోడు ఇంటి సమస్యలు రావడంతో జబర్దస్త్ కు దూరమయ్యాడీ కమెడియన్. ఇక వేరే దిక్కులేక కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూరగాయలు, ఆకు కూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరైన శేఖర్.. ‘ నేను తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివాను. ఆ తర్వాత అమ్మ నాన్న చదివియ్వకపోవడంతో కూలి పనులకు వెళ్లాను. మిర్చి మార్కెట్ యార్డ్ లో హమాలీ పనులు కూడా చేశాను. నేను మంచి డ్యాన్సర్ ను. అదృష్టం కొద్దీ జబర్దస్త్ లో అవకాశమొచ్చింది. నాకున్న ట్యాలెంట్ తో చాలా మందిని నవ్వించాను. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు నాతో ఉండలేకపోయింది. నా భార్యకు థైరాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమెను తరచూ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వచ్చింది. నా భార్య, పిల్లలకు దగ్గరగా ఉండాలనే జబర్దస్త్ కు దూరమయ్యాను. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా జబర్దస్త్ ను వదిలి పెట్ట్సాల్సి వచ్చింది. నా కుటుంబాన్ని నేనే పోషించాలి. వీరిని వదిలిపెట్టి ఎక్కడకు పోలేను. ఒకవేళ జబర్దస్త్ లో మళ్లీ అవకాశమొస్తే ఆలోచిస్తాను. కానీ ప్రస్తుతానికి నా కుటుంబమే నాకు ముఖ్యం’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు శేఖర్.
Jabardasth Sekhar Alias Khammam Sujatha
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.