
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది. అప్పుడే ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్. ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా నిలిచాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌజ్ బయట కూడా పల్లవి ప్రశాంత్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా రైతుబిడ్డ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో పల్లవి ప్రశాంత్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో రైతు బిడ్డకు అవకాశం వచ్చిందనేది ఈ వార్త సారాంశం. పవన్- హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పల్లవి ప్రశాంత్ నటించనున్నాడని టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ హరీశ్ శంకర్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారంట. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ గేమ్ డైరెక్టర్‌కు బాగా నచ్చేసిందట. అందుకే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో గెస్ట్‌గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి రైతు బిడ్డ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.