ప్రీతి జింటా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నెట్టింట ఎమోషనల్ పోస్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని.. తమ పొరుగువారంతా ఇంతకా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
“లాస్ ఎంజిల్స్ లో మా చుట్టూ ఉన్నవారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయం బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదాకర దృశ్యాలు చూసి కనిపించాయి. ఈ మంటల్లో సర్వసం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నాను. వారి ప్రాణాలను కాపాడేందుకు ఆగ్నిమాపక శాఖ, సిబ్బందితోపాటు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో చెలరేగిన కార్చిచ్చులో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఇదిలా ఉంటే.. ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. అంతకు ముందు చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి లాస్ ఎంజిల్స్ లో ఉంటుంది. చాలా కాలం తర్వాత సన్నీ డియోల్ హీరోగా నటించిన లాహోర్ 1947 చిత్రంలో నటిస్తుంది.