
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ నటుడు సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ‘ప్రేమ కావాలి’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లవ్లీ, శమంతకమణి, శశి, టాప్ గేర్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘శంబాల’ సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆయన చేసిన ఓ పోస్ట్ చర్చకు దారితీసింది. ఆది సాయికుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొన్ని నవ్వుతున్న స్మైలీ ఎమోజీలను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక రాజకీయ ఉద్దేశం ఉందంటూ కొందరు నెటిజన్లు చర్చించుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆది ఈ పోస్ట్ పెట్టి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆది సాయికుమార్ కెరీర్‌ను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తున్నా.. ఇప్పటికీ కెరీర్‌లో ఎదగలేదని, ఇటీవల గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ మౌళికి ఉన్న మార్కెట్ కూడా ఆయనకు లేదంటూ ట్రోల్ చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీని పై ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, పోరాటాలు ఉంటాయి. నాని, రవితేజ వంటి నటులు కూడా ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అలాంటి నటులకు విజయాలు, అపజయాలు ఎదురైనంత మాత్రాన వారి కెరీర్ ముగిసిపోయిందని అనుకోవడం సరికాదని సాయి కుమార్ అన్నారు. ప్రతి నటుడి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సహజమని ఆయన పేర్కొన్నారు. ఇతరులను విమర్శించడం, కించపరచడం మానేసి.. వారిని ప్రోత్సహించడం నేర్చుకోవాలని సూచించారు. సినిమా అనేది సుదీర్ఘ ప్రయాణమని, అందులో గెలుపోటములు సహజమని చెప్పారు.
సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫ్యాన్ వార్స్‌పై కూడా ఆయన స్పందించారు. ఇలాంటి ధోరణి వల్ల సినిమాలను ఆస్వాదించాల్సిన సోషల్ మీడియా వేదికలు అభిమానుల మధ్య గొడవలకు కేంద్రాలుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రతి నటుడి కష్టాన్ని, వారి ప్రయాణాన్ని గౌరవించాలని సాయి కుమార్ సూచించారు. అయితే ఆది సాయికుమార్ కెరీర్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ కావాలి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ఆది తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారని మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఒక నటుడి ప్రయాణాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆది సాయికుమార్ స్మైలీ ఎమోజీల పోస్ట్‌తో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.