
లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ కార్యక్రమంలో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ గారి “శంకరాభరణం” చిత్రంపై మాట్లాడిన మాటలు, ఆ సినిమా సృష్టించిన అపూర్వమైన ప్రభావాన్ని స్పష్టంగా చిత్రీకరించాయి. ఆయన స్మృతుల్లోని అద్భుత క్షణాలను పంచుకుంటూ, ఆ చిత్రం కేవలం ఒక సినిమా కాదని, అది ఒక “హాపెనింగ్” అని అన్నారు. రామలింగయ్య గారు అన్న మాటను ఎస్పీబీ గుర్తుచేసుకున్నారు. “నాయనా, నేను వెధవ వేషాలు వేసి నాకు ఏదన్నా పాప పంకిలం అంటుకుని ఉంటే, మీ అన్నయ్య శంకరాభరణంతో మొత్తం క్షాళనం చేసేసాడు అయ్యా.” ఈ ఒక్క వాక్యమే శంకరాభరణం ఎంత పవిత్రమైన ప్రభావం చూపిందో తెలుపుతుంది అని చెప్పుకొచ్చారు. సినిమా హాల్స్‌లో ప్రేక్షకులు ఎంత నిశ్శబ్దంగా చూసేవారో బాలసుబ్రహ్మణ్యం వివరించారు. ఎవరైనా ఊరికే దగ్గినా, ఉమ్మ్ అన్నా కూడా “షో అనే లెవెల్ కి వచ్చిన సినిమా అది” అని పేర్కొన్నారు. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు కళ్ళల్లో జ్యోతులు వెలుగుతుండగా, కన్నీళ్లతో తడిసి ఎర్రబడిన కళ్ళతో, చీరకొంగులతో కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వచ్చేవారట.
సినిమా 50 రోజులు పూర్తయిన సందర్భంగా జంధ్యాల, సుందరరామ్మూర్తి కలిసి విశ్వనాథ్ గారికి నిర్వహించిన “గురుపూజ” కార్యక్రమాన్ని ఎస్పీబీ గుర్తు చేసుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ వేడుకలో సోమయాజులు గారిని తేరుల మీద వెళుతున్నట్టే ప్రజలు స్వాగతించారని, అద్భుతంగా సత్కరించారని తెలిపారు. సోమయాజులు గారు ప్యాంట్, షర్ట్ ధరించి ఉన్నా, సిగరెట్లు తాగే అలవాటున్నా, ప్రజలు ఆయన్ను శంకరశాస్త్రిగానే చూసి అఖండ గౌరవం ఇచ్చారని, ఆయన దొంగతనంగా సిగరెట్ కాల్చేవారని బాలసుబ్రహ్మణ్యం సరదాగా చెప్పారు. శంకరాభరణం సాధించిన విజయానికి మరో ఉదాహరణగా ఢిల్లీ ప్రెస్ క్లబ్లో జరిగిన సంఘటనను ఎస్పీబీ వివరించారు. సినిమా క్లైమాక్స్ అయిపోగానే జనాల స్పందన చూడటానికి బయటికి వచ్చేవారిలో ఎస్పీబీ, ఏడిద నాగేశ్వరరావు, సోమయాజులు, విశ్వనాథ్, మహదేవన్ ఉండేవారు. ఒక సర్దార్జీ కళ్ళనిండా నీళ్లతో వచ్చి, “కా హే ఓ శంకర్ శాస్త్రి జీ?” అంటూ సోమయాజులు గారిని పట్టుకుని, “మేరే సాత్ ఆయియే” అని ప్రొజెక్షన్ రూమ్‌కు తీసుకెళ్ళాడట. ప్రొజెక్షన్ అయిన తర్వాత వేడిగా ఉన్న ప్రొజెక్టర్‌ను “ఏక్ బార్ ఛూయియే హమారా ప్రొజెక్టర్ కా” అంటూ తాకమని కోరాడని, శంకరశాస్త్రి మీ సినిమా వేసి నా ప్రొజెక్టర్ పునీతం అయిందని అన్నాడు. ఈ సంఘటన శంకరాభరణం దేశవ్యాప్తంగా సృష్టించిన భావోద్వేగ ప్రభావాన్ని తెలియజేస్తుంది.
అమెరికాలో జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఎస్పీబీ ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలో ఒక సినిమా తాలూకు నటీనటులు కలిసి ఆ సినిమా పాటలతోటే మూడు గంటలపాటు నృత్య గాన కార్యక్రమం చేయడం శంకరాభరణంతోనే మొదలైందని తెలిపారు. ఇది మళ్ళీ జరిగిందేమో కూడా తెలియదని, తర్వాత “ఆనందభైరవి”కి జరిగినా, శంకరాభరణం ఘనత ప్రత్యేకమైనదని అన్నారు. ఈ ప్రదర్శనలలో ఎస్పీబీ, ఆయన అబ్బాయి చరణ్, పల్లవి, శైలజ కలిసి ఒకటి రెండు సీన్లలో నటించారని, మంజు భార్గవి నృత్యాలు చేశారని చెప్పారు. కేవలం ఒక హార్మోనియం, క్లారినెట్, ఘటం, తబలాతో కూడిన బేర్ మినిమమ్ ఆర్కెస్ట్రాతో దాదాపు 19-20 షోలు కోస్ట్ టు కోస్ట్ జరిగాయని వివరించారు. శంకరాభరణం సినిమా కేవలం ఒక చిత్రం కాదని, అది ప్రజల హృదయాలను కదిలించిన ఒక అద్భుతమైన అనుభవం అని ఎస్పీబీ భావోద్వేగంగా తెలిపారు. ప్రస్తుతం ఎస్పీబీ చేసిన కామెంట్స్ మరోసారి వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?