మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ 152వ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చిన్న పాత్ర కాకుండా.. సినిమాను టర్న్ తిప్పే పాత్రలో చెర్రీ కనిపించబోతున్నట్లు టాక్. ఇక ఈ పాత్ర నిడివి కూడా చాలానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ చిరు, చరణ్‌ల మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం చరణ్ 40 రోజుల డేట్లను కూడా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ పాత్ర కోసం హీరోయిన్‌ను కూడా పెట్టాలని కొరటాల భావిస్తున్నారట. ఈ క్రమంలో కియారా అద్వాణీని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా కియారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామలో చెర్రీ సరసన నటించింది ఈ భామ. సినిమా ఫ్లాప్ అయినా ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఈ క్రమంలో ఆ మధ్యన కియారా బర్త్‌డే వేడుకల కోసం ముంబయికు కూడా వెళ్లారు చెర్రీ. ఇలా అటు కొరటాల, ఇటు చెర్రీ ఇద్దరితో మంచి సాన్నిహిత్యం కియారాకు ఉంది. దీంతో తమ ఆఫర్‌కు ఆమె ఒప్పుకుంటుందని వారు భావిస్తున్నారట. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా రెండోసారి జత కట్టబోతోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.