
దశాబ్దాల క్రితం ఈ నటుడు కెనడాలోని ఒక చిన్న పట్టణంలో నివసించేవారు. అక్కడ టీనేజ్ ప్రెగ్నెన్సీలు, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే అటువంటి వాతావరణంలో కూడా ఒక కుటుంబంలోని పిల్లలు మాత్రం ఎంతో క్రమశిక్షణతో, ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా పెరగడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆ ఇంటి యజమానురాలిని కలిసి దీని రహస్యం ఏమిటని అడగగా, ఆమె ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. అదేమిటంటే, “పిల్లలకు 15-16 ఏళ్లు వచ్చే వరకు వారికి ఖాళీ సమయం లేకుండా చూసుకోవాలి”. ఈ ఒక్క సూత్రాన్ని ఆయన తన కొడుకు విషయంలో అక్షరాలా పాటించారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. ఆర్ మాధవన్.
ఆ కెనడియన్ మహిళ చెప్పినట్లుగా పిల్లలకు ఖాళీ సమయం ఉంటేనే వారి ఆలోచనలు చెడు వైపు మళ్లే అవకాశం ఉంటుంది. అందుకే తన కుమారుడికి ఇష్టమైన పనుల్లో నిరంతరం నిమగ్నమయ్యేలా మాధవన్ జాగ్రత్త పడ్డారట. ఒక పని పూర్తవ్వగానే మరో పని ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే ఆ పనులు పిల్లలకు భారంగా లేదా బలవంతంగా అనిపించకూడదని, వారు ఇష్టంతో చేసేలా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఆ పద్ధతే తన కొడుకును నేడు ఒక గొప్ప క్రీడాకారుడిగా తీర్చిదిద్దిందని ఆయన గర్వంగా చెబుతారు.
జీవితంలో కేవలం విజయం మాత్రమే సరిపోదని, సంస్కారం కూడా ఉండాలని ఈ స్టార్ హీరో బలంగా నమ్ముతారు. అందుకే తన కొడుకుకు ‘కృతజ్ఞతా భావం’ (Attitude for Gratitude) గురించి చిన్నప్పటి నుండే నేర్పించారు. తాము అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం వెనుక ఎవరో ఒకరి కష్టం దాగి ఉంటుందని గుర్తించాలని ఆయన అంటారు. ఉదాహరణకు, తన కొడుకు వేసుకునే ఖరీదైన షూస్ విలువ తమ ఇంట్లో పనిచేసే వంటవాడి ఏడాది జీతంతో సమానమని గుర్తు చేస్తూ.. సామాన్యుల కష్టాన్ని అర్థం చేసుకునేలా శిక్షణ ఇచ్చారు.
సమాజంలో హోదాను బట్టి మనుషులను వేరు చూడకూడదని ఈ నటుడు తన కుమారుడికి నూరిపోశారు. ఇంట్లో పనిచేసే వారిని తక్కువ చేసి చూడకుండా, పని మనుషులను ‘దీదీ’ అని పిలవాలని, లిఫ్ట్ మెన్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్లను పేరు పెట్టి పిలవకుండా గౌరవించాలని నేర్పించారు. ఒకసారి వాచ్‌మెన్ వచ్చి ‘నీ కొడుకు చాలా పద్ధతి గలవాడు, నాకు ఎప్పుడూ నమస్తే చెబుతాడు’ అని చెప్పినప్పుడు, తండ్రిగా తన బాధ్యత నెరవేరినట్లు భావించానని మాధవన్ సంతోషంగా పంచుకున్నారు.
1999లో మాజీ ఎయిర్ హోస్టెస్ సరిత బిర్జేను వివాహం చేసుకున్న మాధవన్, 2005లో తన కుమారుడికి జన్మనిచ్చారు. ఇటీవలే ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాధవన్, నిజ జీవితంలో కూడా ఒక గొప్ప తండ్రిగా నిరూపించుకుంటున్నారు. పిల్లలను కేవలం చదువుల్లోనే కాకుండా, సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దడం ఎంత ముఖ్యమో మాధవన్ మాటలు గుర్తు చేస్తున్నాయి.