
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా మెరిసింది. ఏకంగా 7 అవార్డులను సాధించింది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తన సత్తా చాటుతూ పలు విభాగాలలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్డీఆర్ విజేతలకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఇంత అద్భుతంగా రాణించడం చూడటం ఎంతో గర్వంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జాతీయ వేదికపై తెలుగు సినిమా ఇంత అద్భుతంగా రాణించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ” ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చిత్రాల వారీగా అవార్డులు గెలుచుకున్న టీమ్స్ అందరినీ ఆయన పేరుపేరునా అభినందించారు.
బెస్ట్ పాపులర్ మూవీ అవార్డు గెలుచుకున్న కల్కి 2898 AD చిత్రానికి గానూ దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, చిత్ర బృందానికి తారక్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పుష్ప 2 చిత్రానికి గాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, చిత్ర బృందానికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రానికి సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును దక్కించుకున్నారు. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు సినిమా నిర్మించిన నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీలతో పాటు పూర్తి చిత్ర యూనిట్‌కు తారక్ శుభాకాంక్షలు అందజేశారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో అలరించిన 35 చిన్న కథ కాదు చిత్ర బృందం కూడా జాతీయ స్థాయిలో రెండు అవార్డులను గెలుచుకోవడంపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
వీరితో పాటు లక్కీ భాస్కర్ సినిమాకు గాను బెస్ట్ డైలాగ్స్ విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరికి జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ.. నేడు జాతీయ వేదికలపై వరుస అవార్డులతో సత్తా చాటుతోంది. కల్కి, పుష్ప 2, కమిటీ కుర్రోళ్లు వంటి సినిమాలు జాతీయ అవార్డుల పంట పండించడం పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD… @aryasukku garu & the team of #Pushpa2……
— Jr NTR (@tarak9999) July 18, 2026