ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో ఇటీవల మిల్కీబ్యూటీ తమన్నా ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసేందుకు ఆమె అక్కడున్న మార్కెట్ రేట్‌కు రెట్టింపు డబ్బులు చెల్లించిందని వార్తలు వచ్చాయి. బేవ్యూ అనే పేరుతో ఉన్న 22 అంతస్తుల భవనంలోని 14వ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌ను సుమారు రూ.16.60 కోట్లు పెట్టి తమన్నా కొనుగోలు చేసిందని పలు మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కాగా ఈ వార్తలపై తాజాగా మిల్కీబ్యూటీ స్పందించింది.
బేవ్యూలో తాను అపార్ట్‌మెంట్ కొన్న మాట నిజమేనని ఆమె స్పష్టం చేసింది. అయితే తాను సింధీనని.. ఒక అపార్ట్‌మెంట్ కోసం రెట్టింపు రేటును ఎలా ఇస్తానని చెప్పుకొచ్చింది. చాలామంది దీని గురించి తనను ప్రశ్నించారని.. వాటితో విసిగిపోయానని పేర్కొంది. ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్ రెడీ అవుతోందని.. అది పూర్తైన వెంటనే తన తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లిపోతానని తెలిపింది. సాధారణంగా తనకు ఎర్తీ లుక్‌తో కనిపించే ఇళ్లంటేనే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తమన్నా చెప్పింది. కాగా ఈ ఏడాది ఎఫ్ 2తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా.. చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి, దజీట్ మహాలక్ష్మి చిత్రాలలో నటించింది. ఇవి రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.