Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ బీజేపీ రైతులకు భారీ తాయిలాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రైతులు ఐదేళ్ల పాటు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) మంగళవారం ప్రకటించారు. దిబియాపూర్ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే.. రైతులకు వచ్చే ఐదేళ్లు కరెంట్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే మార్చి 10వ తేదీన యూపీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని.. ఆ రోజున బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే.. మార్చి 18న హోలీ పండుగ కానుక ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇళ్లకు చేరుతాయని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 300 కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అయితే.. బీజేపీకి ధీటుగా సమాజ్ వాదీ పార్టీ కూడా హామీలతో దూసుకెళ్తోంది. తాము అధికారంలోకి వస్తే.. బీజేపీ కంటే.. ఎక్కువ అభివృద్ధి చేస్తామంటూ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పలు హామీలను గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం సొంత ఉచిత రేషన్ స్కీమ్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా నెలనెలా కిలో నెయ్యి ఉచితంగా పంపిణీ చేస్తామని అఖిలేష్ హామీనిచ్చారు. రాయబరేలిలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన అఖిలేష్.. ఎన్నికలయ్యేంత వరకే పేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కొనసాగిస్తారని, ఆ తర్వాత దాన్ని ఎత్తేస్తారంటూ విమర్శించారు. గతంలో నవంబర్ వరకూ రేషన్ ఇస్తామని చెప్పి.. యూపీ ఎన్నికలు ప్రకటించడంతో మార్చి వరకూ పొడిగిస్తున్నట్టు చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికలు మార్చితో అయిపోతున్నందున ఢిల్లీ బడ్జెట్‌లో కూడా ఉచిత రేషన్‌కు నిధులు కేటాయించలేదని అఖిలేష్ వివరించారు.
Also Read: