రాజ్యసభ ఎన్నికలు: ఏ రాష్ట్రంలో ఎన్ని?

కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. యావద్దేశం రెండు నెలలకు పైగా అమలైన లాక్‌డౌన్ నుంచి దశలవారీగా బయటపడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం

రాజ్యసభ ఎన్నికలు: ఏ రాష్ట్రంలో ఎన్ని?
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 6:31 PM

కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. యావద్దేశం రెండు నెలలకు పైగా అమలైన లాక్‌డౌన్ నుంచి దశలవారీగా బయటపడుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 స్థానాలకు ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో 37 సీట్లకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 7 రాష్ట్రాల్లో 18 సీట్లకు పోటీ ఏర్పడడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేసింది. వాటిని ఈనెల 19న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఆ రోజు ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం గం. 5.00కు ఫలితాలను వెల్లడించనున్నారు.

ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలతో పాటు గుజరాత్ (4), జార్ఖండ్ (2), మధ్యప్రదేశ్ (3), మణిపూర్ (1), మేఘాలయ (1), రాజస్థాన్ (3) రాష్ట్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్తలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు మండలి రద్దు నిర్ణయం కారణంగా మంత్రి పదవులు కోల్పోనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 5వ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్యను రంగంలోకి దించడంతో పోటీ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో 2 స్థానాల భర్తీకి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కే. కేశవరావును మరో పర్యాయం కొనసాగించగా, రెండో అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేర్లను పార్టీ ఖరారు చేసింది. వారికి పోటీ లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మహాత్మ కొడియార్

సీనియర్ జర్నలిస్టు, ఢిల్లీ