దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ వణికిస్తోంది. కోరలు చాస్తోన్న కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కార్ కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు అమలు చేస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే కరోనాపై పోరులో ఐదు ప్రధాన అంశాలను ఆయుధాలుగా చేసుకుని ఢిల్లీ వైద్య ఆరోగ్య సిబ్బంది యుద్ధం చేస్తోందని వివరించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడుతూ.. మహమ్మారితో యుద్దంలో అడుగడుగునా సాయం చేస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఎత్తివేస్తే కరోనా కేసులు పెరుగుతాయని ముందే అంచనా వేశామని చెప్పారు. కానీ అంచనాకు మించి కేసులు పెరిగాయని అన్నారు. బాధితుల కోసం ఇప్పటివరకు ఢిల్లీలో 13,500 పడకలు సిద్ధం చేశామని చెప్పారు. వీటిలో 6,000 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయనీ.. మిగతా 7,500 పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో కేసుల సంఖ్య పెరిగితే.. అందుకనుగుణంగా సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోటళ్లను ఆస్పత్రులతో అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు.
కోవిడ్ పోరులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించిన ఐదు ఆయుధాలు ఇవే
1. ఐసోలేషన్ సెంటర్లు:
రాష్ట్రంలోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కోవిడ్-19 బాధితుల కోసం కనీసం 40 శాతం బెడ్‌లను కేటాయించి కోవిడ్ నివారణ కేంద్రాలుగా మార్చింది. అంతేగాక హోటల్స్‌ను కూడా కరోనా కేంద్రాలకు కేటాయించడంతో ఇప్పుడు బెడ్‌ల సంఖ్య 13,500కు చేరిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
2. యాంటిజెన్ కిట్లు:
కోవిడ్ టెస్టుల సంఖ్య నాలుగింతలు పెంచినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఢిల్లీలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు 4,59,156 పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. శుక్రవారం ఒక్క రోజే అత్యధికంగా 21,144 పరీక్షలు చేశామని తెలిపారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా యాంటిజెన్ కిట్లను ఆర్డర్ చేసినట్లు ఆయన చెప్పారు.
3. ఆక్సీమీటర్ల పంపిణీ:
హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆక్సీమీటర్లను పంపిణీ చేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కిట్లు కోవిడ్ రోగులకు భద్రతా కవచంగా పనిచేస్తాయి. రోగి ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. ఒకవేళ శ్వాసకోశ ఇబ్బంది ఎక్కువై వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే హెచ్చరిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారిని ఆస్పత్రుల్లో చేర్చేలా వైద్య బృందాలను సిద్ధం చేసినట్టు వివరించారు.ఇందుకోసం 4 వేలకు పైగా ఆక్సి కిట్లను కొనుగోలు చేశామన్నారు.
4. ప్లాస్మా థెరపి:
ఇది వెంటిలేటర్లపై ఉన్న రోగులకు లేదా తీవ్ర స్థాయిలో అనారోగ్యం పాలైన రోగులకు పని చేయదు. కానీ స్వల్ఫ లక్షణాలతో ఉన్నవారికి సహయపడుతుందన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇదే విధానం అమలు చేస్తున్నట్లుగా చెప్పారు.
5. ఇంటింటి సర్వే – స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణ:
కరోనా నివారణకు చివరగా వాడే ఐదవ ఆయుధం సర్వే, స్క్రీనింగ్ అని చెప్పారు. శనివారం నుంచి ఢిల్లీలో 20 వేల మందికి సెరోలాజికల్ సర్వే నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు.
ఇక కరోనాను అరికట్టేందుకు మా ముందు రెండే మార్గాలున్నాయని చెప్పారు. తిరిగి లాక్‌డౌన్‌ను విధించడం… లేదంటే కరోనాతో యుద్దం చేయడమేనని వ్యాఖ్యానించారు. ప్రజల కోరిక మేరకు లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.