Moral Story: చిన్న చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయం.. తెలివైన కాకి కథ
సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది. ప్రతి రాయి చిన్నదే అయినా, అవన్నీ కలిసి పెద్ద మార్పును తీసుకొచ్చాయి. కాకి తన బలాన్ని ఉపయోగించలేదు; తన తెలివిని ఉపయోగించింది. తెలివిగా ఆలోచించింది. మన నిజజీవితంలో కూడా తెలివైన ఆలోచనలు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఆందోళన చెందడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. పనులు అసాధ్యంగా అనిపించినప్పుడు వాటిని వదులుకోకూడదు. ఓర్పుతో, తెలివిగా ఆలోచించి ప్రయత్నించాలి. ఓర్పు, పట్టుదల, తెలివైన ఆలోచన ఎల్లప్పుడూ విజయానికి దారి తీస్తాయి.

అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అడవిలో తిరుగుతూ హాయిగా, సంతోషంగా జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా వేసవి కాలం రానే వచ్చింది. ఎండలు బాగా మండుతున్నాయి. మిట్టమధ్యాహ్నం కావడంతో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఆ ఎండకు తట్టుకోలేక కాకి చెట్టు కొమ్మపై వాలింది. కాకికి చాలా దాహం వేసింది. ‘ఏమిటి ఈ ఎండలు! రోజు రోజుకీ ఎండలు ఎక్కువైపోతున్నాయి. నేను ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నానే! ఈ రోజు ఎండ చాలా మండిపోతుంది. పైగా నాకు చాలా దాహం వేస్తుంది. ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకోవాలి. ఎక్కడైనా నీళ్లు కనిపిస్తాయేమో వెళ్లి చూస్తాను’ అని అనుకుంది. కాకి ఆకాశంలో ఎగురుతూ కిందికి చూస్తూ నీటి కోసం వెతకసాగింది. అలా ఎంత దూరం వెళ్లినా ఎక్కడా నీరు కనిపించలేదు. నేలంతా ఎండిపోయి ఉంది. నదులు, చెరువులు ఇలా అన్నిచోట్లా వెతికింది. కానీ అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా తాగడానికి నీరు దొరకడం లేదు.
‘పైనుంచి ఎండ మండిపోతుంది. నేను ఈ ఎండలో ఎగరలేకపోతున్నానే! నా గొంతు కూడా ఎండిపోతుంది’ అని కాకి బాధపడింది. ఎండలో ఎగిరి ఎగిరి వేడికి తట్టుకోలేక క్షణక్షణానికి బలహీనపడుతూ ఆకాశంలో ఎగరలేకపోయింది. ‘ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ దాహానికి తట్టుకోలేకపోతున్నానే! నా గొంతు ఎండిపోతుంది. ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకోవాలి. లేదంటే ఈ ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయేలా ఉన్నాను. ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకోవాల్సిందే’ అని అనుకుంది. కాకి ఇంకాస్త ఓపిక తెచ్చుకుని ఆకాశంలో ఎగురుతూ నీటి కోసం మళ్లీ వెతకసాగింది. అలా వెళ్తుండగా ఒక పెద్ద చెట్టు కింద మట్టి కుండ కనిపించింది. ఆ కుండను చూడగానే కాకికి చాలా సంతోషం కలిగింది.
‘ఆహా! ఆ చెట్టు కింద ఒక కుండ ఉంది. బహుశా ఆ కుండలో నీరు ఉండవచ్చు. వెళ్లి చూస్తాను’ అని వెంటనే కాకి ఎగురుకుంటూ వెళ్లి ఆ కుండపై వాలింది. కుండ లోపలికి చూసింది. అందులో నీళ్లు కనిపించాయి. కాకి చాలా సంతోషించింది. కుండలో ఉన్న నీటిని తాగడానికి ప్రయత్నించింది. కానీ నీరు కాకి ముక్కుకు అందలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. అయినా తాగలేకపోయింది. ఎందుకంటే కుండలో నీరు అడుగుభాగంలో ఉన్నాయి. ‘అయ్యో! ఏంటిది ఇలా జరిగింది? అసలే నాకు చాలా దాహంగా ఉంది. ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాను. వెతకగా వెతకగా ఈ కుండలో నీరు దొరికాయి. కానీ తాగలేకపోతున్నానే! కుండలో నీళ్లు అడుగుభాగంలో ఉన్నాయి. అవి నా ముక్కుకు అందడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దాహాన్ని ఎలా తీర్చుకోవాలి?’ అని కాకి నిరాశ చెందింది. కానీ కాకి నిరాశలోనే ఉండిపోలేదు. ఈ ఎండకు, దాహానికి తట్టుకోలేక ఎలాగైనా కుండలోని నీటిని తాగాలని నిర్ణయించుకుంది. తనకు తోచిన అన్ని ప్రయత్నాలూ చేయసాగింది. మొదట కాకి కుండను వంచడానికి ప్రయత్నించింది.
‘కదలవే కుండా! కాస్తయినా కదులు. అమ్మో! ఈ కుండ ఏంటి ఇంత బరువుగా ఉంది? కొంచెం కూడా కదలడం లేదు. నాకు చాలా దాహం వేస్తోంది. ఇప్పుడు నేను ఏం చేయాలి?’ అని కాకి ప్రయత్నించింది. అయినా కుండ కదలలేదు. ‘ఇలా కాదు. నేను ఈ కుండను పగలగొడతాను’ అని కాకి కుండను పగలగొట్టడానికి ప్రయత్నించింది. ‘పగలవే కుండా! పగులు. ఇంకెంత గట్టిగా కొట్టాలి నిన్ను? దెబ్బకు ముక్కలైపోవాలి’ అని ముక్కుతో గట్టిగా పొడవసాగింది. కానీ కుండ ఎంతకీ పగలలేదు. ‘అయ్యో! ఈ కుండ ఇంత గట్టిగా ఉందేంటి? ఎంత కొట్టినా పగలడం లేదు. కొట్టి కొట్టి నా ముక్కు నొప్పి పెడుతోంది. కానీ ఈ కుండ మాత్రం కొంచెం కూడా పగలడం లేదు. ఇలాగైతే నా దాహం ఎలా తీరుతుంది?’ అని కాకి బాధపడింది. అలా రకరకాలుగా ప్రయత్నించి ప్రయత్నించి చివరకు చాలా అలసిపోయింది. కాకికి ఏం చేయాలో అర్థం కాలేదు.
‘అయ్యో! ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఎండకు, దాహానికి తట్టుకోలేకపోతున్నానే! ఇలా బాధపడుతూ కూర్చుంటే నా దాహం తీరేది ఎలా? ఎలాగైనా నా దాహాన్ని తీర్చుకోవాల్సిందే’ అని కాకి గట్టిగా నిర్ణయించుకుంది. కాకి తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనించసాగింది. అలా చూస్తుండగా చుట్టుపక్కల చిన్న చిన్న గులకరాళ్లు కనిపించాయి. ఆ గులకరాళ్లను చూడగానే కాకికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ‘ఈ చుట్టుపక్కల చాలా గులకరాళ్లు ఉన్నాయి. ఈ గులకరాళ్లను కుండలో వేస్తే నీరు పైకి వస్తాయి. అప్పుడు నేను ఈ కుండలోని నీళ్లను సులభంగా తాగగలను’ అని అనుకుంది. వెంటనే కాకి ఓపిక తెచ్చుకుని తన ముక్కుతో ఒక గులకరాయిని తీసుకొచ్చి కుండలో వేసింది. అలా ఒక్కొక్క గులకరాయిని తెచ్చి కుండలో వేయసాగింది. గులకరాళ్లను వేస్తుండగా కుండలోని నీళ్లు క్రమంగా పైకి రావడాన్ని గమనించింది.
‘ఆహా! కుండలో నీళ్లు పైకి వస్తున్నాయి. నా అద్భుతమైన ఆలోచన బాగానే పనిచేస్తోంది’ అని కాకి చాలా ఆనందపడింది. ‘ఈ నీళ్లన్నీ పైకి వచ్చేదాకా కుండలో చాలా గులకరాళ్లను వేస్తాను’ అని రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని గులకరాళ్లను తీసుకొచ్చి కుండలో వేయసాగింది. అలా గులకరాళ్లను వేస్తుండగా అడుగున ఉన్న నీళ్లు నెమ్మదిగా కుండ పైభాగానికి వచ్చాయి. అది చూసి కాకి చాలా సంతోషించింది. కాకి కష్టపడి చేసిన ప్రయత్నం చివరకు విజయవంతమైంది. కాకి కుండలోని పైకి వచ్చిన చల్లని నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది. ఆ నీటిని తాగిన తర్వాత కాకికి ఎంతో ఉపశమనం కలిగింది. తన దాహం తీరడంతో చాలా సంతోషించింది. అలా కాకి తన దాహాన్ని తీర్చుకుని ఆనందంతో రెక్కలు విప్పి ఆకాశంలోకి హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. తెలివిగా ఆలోచించి తన దాహాన్ని తీర్చుకుని తన ప్రాణాలను రక్షించుకుంది.
నీతి
తెలివి, ఓర్పు, పట్టుదల ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. దాహంతో అలమటిస్తున్న కాకి నీటి కోసం ఎంత వెతికినా నీరు దొరకలేదు. చివరకు ఒక కుండలో నీళ్లు కనిపించినా, అవి అడుగున ఉండటంతో కాకి తాగలేకపోయింది. మొదట కుండను వంచడానికి, పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కాకి నిరాశతో వెనుదిరగలేదు. తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి, గులకరాళ్లను కుండలో వేస్తే నీళ్లు పైకి వస్తాయని తెలివిగా ఆలోచించింది. ఒక్కొక్క గులకరాయిని కుండలో వేస్తూ చివరకు నీటిని పైకి తెచ్చుకుని తన దాహాన్ని తీర్చుకుంది. ఈ కథ మనకు ఎన్నో ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా, నిరాశ చెందకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో మార్గాన్ని అన్వేషించాలి. మన బలాన్ని మాత్రమే నమ్ముకోకుండా, మన తెలివితేటలను కూడా ఉపయోగించాలి. చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నిరంతరం కొనసాగిస్తే గొప్ప విజయాన్ని సాధించవచ్చు.
మన నిజజీవితంలో కూడా చదువు, ఉద్యోగం, కుటుంబం వంటి విషయాల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఓర్పుతో ఆలోచించి సరైన పరిష్కారాన్ని కనుగొనాలి. కష్టాలు ఎదురైనప్పుడు మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపకుండా, లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. ఈ కథ అందించే ముఖ్యమైన సందేశం ఏమిటంటే — సమస్య ఎంత పెద్దదైనా, దానిని పరిష్కరించే మార్గం తప్పకుండా ఉంటుంది. ఆ మార్గాన్ని కనుగొనడానికి తెలివిగా ఆలోచించాలి, ఓర్పుతో ప్రయత్నించాలి, పట్టుదలతో ముందుకు సాగాలి.
గుర్తుంచుకోవాల్సిన జీవిత పాఠాలు.. తెలివి బలం కంటే గొప్పది. ఓర్పు విజయానికి పునాది. వైఫల్యం ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. పరిసరాలను గమనించడం, కొత్తగా ఆలోచించడం సమస్యల పరిష్కారానికి సహాయపడతాయి. చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు దారి తీస్తాయి. కాకిలాగే మనం కూడా కష్టాలను చూసి భయపడకుండా, తెలివిగా ఆలోచించి, ఓర్పుతో ప్రయత్నిస్తే విజయం సాధించగలం. పట్టుదలతో ప్రయత్నించే వారికి అసాధ్యమనిపించే పనులు కూడా సాధ్యమవుతాయి.




