TGSRTC Results 2026: ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 2 రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 29వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు విడుదల చేశారు. అభ్యర్థుల మార్కులతో పాటు వారి వ్యక్తిగత ఓఎంఆర్ షీట్ల స్కాన్డ్ కాపీలను..

హైదరాబాద్: ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ)లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 29వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు విడుదల చేశారు. అభ్యర్థుల మార్కులతో పాటు వారి వ్యక్తిగత ఓఎంఆర్ షీట్ల స్కాన్డ్ కాపీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా వీటిని చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది కీలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ విభాగంలో 15,796 మంది పరీక్షకు హాజరుకాగా 9,377 మంది (59.36 శాతం) అర్హత సాధించారని, అలాగే మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ విభాగంలో 4,817 మందికి గాను 2,755 మంది (57.19 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ అంబర్‌పేటలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ)లో ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని చైర్మన్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను ఈనెల 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్దేశిత సమయంలో పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులు తమ అర్హతను కోల్పోతారని, ఏవైనా సందేహాలుంటే support@tslprb.in మెయిల్ ద్వారా లేదా పనివేళల్లో 9391005006 నంబరును సంప్రదించాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట తీసుకురావాల్సిన పత్రాల జాబితాను (చెక్ లిస్ట్) చైర్మన్ ఈ సందర్భంగా విడుదల చేశారు. అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం ప్రింటౌట్, ఆధార్ కార్డు, పదో తరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్, పోస్టుకు సంబంధించిన విద్యార్హత పత్రాలు, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్లు తీసుకురావాలని సూచించారు. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదవని పక్షంలో 7వ తరగతికి ముందు వరుసగా 4 లేదా 7 ఏళ్ల నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కమ్యూనిటీ సర్టిఫికేట్ (ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-1, 2, 3 ఉప వర్గీకరణతో కూడిన పత్రం), ఏప్రిల్ 1, 2025 తర్వాత జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ లేదా బీసీ అభ్యర్థులు నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్లు సమర్పించాలని వివరించారు. ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కింద అభ్యర్థులు డిశ్చార్జ్ బుక్ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఆర్టీసీలో పనిచేస్తున్న వారైతే సంబంధిత అథారిటీ జారీ చేసిన సర్వీస్ సర్టిఫికేట్‌తో పాటు ఇతర ఏవైనా సంబంధిత పత్రాల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలియజేశారు.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




