AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం’.. CM రేవంత్‌రెడ్డి ప్రకటన

పోలీసుశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2028లోపు విడతల వారీగా పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీసుశాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం..

'2028లోపు పోలీసుశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం'.. CM రేవంత్‌రెడ్డి ప్రకటన
Telangana Plans To Fill 5,000 More Police Vacancies
Srilakshmi C
|

Updated on: Oct 22, 2026 | 3:11 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 22: తెలంగాణ పోలీసుశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2028లోపు విడతల వారీగా పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీసుశాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (AI) వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో అక్టోబర్‌ 21న నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుశాఖను బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 16 వేల మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లను నియమించినట్లు వెల్లడించారు. పోలీసుశాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2028లోపు దశలవారీగా పోలీసుశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. కొత్త సిబ్బంది నియామకంతో పాటు వారికి మెరుగైన శిక్షణ అందించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడానికీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

పోలీసుశాఖలో యువతకు అవకాశాలు కల్పించడంలో భాగంగా ఇటీవల 112 మంది డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్నారని సీఎం వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంత పెద్దఎత్తున డీఎస్పీల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ జరగలేదని పేర్కొన్నారు. యువ అధికారుల రాకతో పోలీసుశాఖ మరింత సమర్థంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం కూడా మారుతోందని సీఎం అన్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (AI) వినియోగంపై పోలీసులు దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఆధునిక నేరాలను గుర్తించడం, వాటిని అరికట్టడం, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌లో ప్రస్తుతం 350 మంది విద్యార్థులు చదువుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. మంచిరేవుల వద్ద నిర్మిస్తున్న శాశ్వత క్యాంపస్‌ ఏప్రిల్‌ నాటికి పూర్తయితే 720 మంది విద్యార్థులకు విద్య అందించే అవకాశం ఉంటుందని వివరించారు. పోలీసుశాఖలో నియామకాలు, శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యా సదుపాయాల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.

Follow Us