CBSE 10th Class Exams 2026: ‘తొలి విడత బోర్డు పరీక్షలు రాస్తేనే.. రెండో విడత రాసేందుకు అనుమతి’.. విద్యార్ధులకు CBSE క్లారిటీ
ఈ ఏడాది నుంచి సీబీఎస్సీ టెన్త్ పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నట్లు ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తొలి విడత పక్కన పెట్టి.. నేరుగా రెండో ఎడిషన్‌లో మాత్రమే పరీక్షలు రాస్తామంటూ కొందరు విద్యార్ధులు బోర్డుకు అభ్యర్ధనలు చేశారు. దీనిపై తాజాగా బోర్డు స్పష్టత ఇస్తూ ప్రకటన వెలువరించింది..

హైదరాబాద్, ఫిబ్రవరి 17: సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు మంగళవారం (ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభమైనాయి. మరోవైపు ఈ ఏడాది నుంచి సీబీఎస్సీ టెన్త్ పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నట్లు ఇప్పటికే బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తొలి విడత పక్కన పెట్టి.. నేరుగా రెండో ఎడిషన్‌లో మాత్రమే పరీక్షలు రాస్తామంటూ కొందరు విద్యార్ధులు బోర్డుకు అభ్యర్ధనలు చేశారు. వీటిని బోర్డు తోసిపుచ్చింది. విద్యార్థులంతా తొలి విడత పరీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాలని, అలా హాజరైన వారికి మాత్రమే రెండో విడతలో అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రెండో విడతలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అర్హతలను బోర్డు ప్రకటించింది. అవేంటంటే..
ఇంప్రూవ్‌మెంట్ కేటగిరీ
విద్యార్ధులంతా తొలి విడత పరీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారు మెరుగైన మార్కుల కోసం మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ల్యాంగ్వేజెస్ వంటి ఏవైనా 3 సబ్జెక్టుల్లో స్కోర్ మెరుగుపరచుకోవడానికి రెండో విడత రాసేందుకు అవకాశం ఉంటుంది.
ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీ
మొదటి విడత పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ పరీక్షలకు హాజరుకానివారు రెండో ఎడిషన్ పరీక్షలు రాయడానికి అనుమతి ఉండదు. ఈ విద్యార్థులు ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీలో ఉంచుతారు. వీరంతా మరుసటి ఏడాది ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు మాత్రమే అనుమతిస్తారు.
కంపార్ట్‌మెంట్ కేటగిరీ
తొలి విడతలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉంచుతారు. దీనికింద రెండో ఎడిషన్ రాయడానికి ఆ విద్యార్థులు అనుమతి ఉంటుంది. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు స్వతంత్ర అదనపు సబ్జెక్టులలో హాజరయ్యేందుక అవకాశం ఉండదు.
రెండో సెషన్ పరీక్షలకు ఏయే విద్యార్ధులకు అర్హత ఉంటుందంటే?
- ఏవైనా మూడు మెయిన్ సబ్జెక్టులలో ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు
- మొదటి లేదా మూడవ కంపార్ట్‌మెంట్ రాసేందుకు
- కంపార్ట్‌మెంట్ ప్లస్ ఇంప్రూవ్‌మెంట్
- తొలి విడతలో ఉత్తీర్ణులైన విద్యార్థులు స్కోర్ పెంచుకునేందుకు రాయవచ్చు
కాగా పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు చేపట్టనున్నట్లు సీబీఎస్సీ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ పదో తరగతి తొలి విడత పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు కొనసాగనున్నాయి. అయితే ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాయని ఏ విద్యార్థి కూడా అదే ఏడాది మే నెలలో జరిగే రెండవ బోర్డు పరీలక్షకు హాజరు కావడానికి అనుమతి ఉండదని CBSE స్పష్టం చేసింది. విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యా విధానం (NEP) ఈ సిఫార్సులు చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




