పాఠశాల స్థాయిలో రెండో తరగతి వరకు రాత పరీక్షలను తొలగించాలని నేషనల్ కరికులమ్ ఫ్రేంవర్క్ (ఎన్‌సీఎఫ్) ముసాయిదా సిఫార్సు చేసింది. రాత పరీక్షతో కూడిన మూల్యాంకనం రెండో తరగతి దాకా విద్యార్థులకు ఒత్తిడితో కూడిన అదనపు భారంగా ఉంటుందని, అందువల్ల 3వ తరగతి నుంచి ఈ పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) పరిధిలో జాతీయస్థాయి సిలబస్‌పై ఈ ఫ్రేంవర్క్ కమిటీ కసరత్తు పూర్తిచేసింది. అంతేకాకుండా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మూల్యాంకనానికి రెండు విధానాలను కమిటీ సూచించింది. రికార్డింగు, డాక్యుమెంటేషను ద్వారా క్రమబద్ధమైన ఆధారాలు సేకరించి విద్యార్థుల ప్రగతి విశ్లేషణ జరగాలని తెల్పింది. ఇదంతా విద్యార్థుల అభ్యాస ప్రక్రియలో సహజసిద్ధమైన కొనసాగింపుగా చేయాలని వివరించారు. 3వ తరగతి నుంచి సన్నాహక దశగా పరిగణిస్తూ రాత పరీక్షలు నిర్వహించవచ్చని సిఫార్సు చేశారు. 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాల దృష్టి భావనాత్మక అవగాహన, ఉన్నత శ్రేణి సామర్థ్యాల వైపు ఉండాలని తెలిపింది.
కాగా వచ్చేఏడాది నుంచి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని కేంద్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. అలాగే 11వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని సూచించింది. విద్యార్థులు ఈ రెండు పర్యాయాల్లో తమకు నచ్చిన సమయంలో పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు కూడా కల్పించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు వచ్చే (2023-24) విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక ముసాయిదాను రూపొందించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.