కోచింగ్ లేకుండానే UPSC సివిల్స్‌లో 11వ ర్యాంక్.. టాపర్‌ సాయి శివాని సక్సెస్‌ స్టోరీ!

వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎలాంటి కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ వనరులతో ప్రిపరేషన్ కొనసాగించారు. చిన్నప్పటి కలను నిజం చేసుకున్న సాయి శివాని తన విజయ రహస్యం, ప్రిపరేషన్ విధానం, యువతకు ఇచ్చిన సలహాలు ఏమిటో తెలుసుకుందాం..

కోచింగ్ లేకుండానే UPSC సివిల్స్‌లో 11వ ర్యాంక్.. టాపర్‌ సాయి శివాని సక్సెస్‌ స్టోరీ!
UPSC Civils 11th Ranker Sai Shivani

Updated on: Nov 07, 2026 | 12:00 PM

కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని నిరూపించారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు. ఎలాంటి కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ వనరుల సహాయంతో ప్రిపరేషన్ కొనసాగించి ఈ అద్భుత విజయాన్ని అందుకున్నారు. సివిల్ సర్వీసెస్‌లో చేరి ప్రజలకు సేవ చేయాలనేది సాయి శివాని చిన్నప్పటి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నారు. తన కష్టానికి తగిన ఫలితం రావడంతో ఎంతో సంతోషంగా ఉందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా సాయి శివాని మాట్లాడుతూ.. యూపీఎస్సీ ఫలితాల్లో టాప్ 50లో ర్యాంకు వస్తుందని ఆశించానని, అయితే ఏకంగా 11వ ర్యాంకు సాధిస్తానని ఊహించలేదని చెప్పారు. ఇన్నేళ్లుగా కంటున్న కల నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు.

సాయి శివాని కుటుంబ నేపథ్యం సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. ఆమె పాఠశాల విద్యను ఖమ్మం జిల్లాలోని వివేకభారతి స్కూల్, నిర్మల్ హృదయ హైస్కూల్‌లో పూర్తి చేశారు. పదో తరగతిలో సాధించిన మంచి మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ఒంగోలులో సీటు సాధించారు. అక్కడ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కోర్సును అభ్యసించారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివినప్పటికీ సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే కోరిక మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి ఉన్న కలను వదులుకోలేకపోయారు. ఇంజనీరింగ్ పూర్తి చేస్తే స్థిరమైన కెరీర్ ఉంటుందని కుటుంబ సభ్యులు, ఇతరులు సూచించడంతో ఆ కోర్సును ఎంచుకున్నారు.

అయితే ఇంజనీరింగ్ చివరి సంవత్సరానికి వచ్చేసరికి మళ్లీ సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కరోనా సమయంలోనే యూపీఎస్సీ పరీక్షల గురించి విశ్లేషించి కొన్ని సబ్జెక్టులను చదివారు. 2022 మేలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అదే ఏడాది జూలై నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. సాయి శివాని తన మొదటి, రెండో ప్రయత్నాల్లోనూ ఇంట్లోనే ఉంటూ ప్రిపరేషన్ కొనసాగించారు. ఇందుకోసం వివిధ ఆన్‌లైన్ వనరులను ఉపయోగించుకున్నారు. ప్రణాళికాబద్ధమైన చదువు, నిరంతర సాధనతో పరీక్షకు సిద్ధమయ్యారు. తన విజయానికి క్రమశిక్షణ, ప్రతిరోజూ చేసే కృషి ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె పేర్కొన్నారు. సివిల్స్ అయినా, రాష్ట్ర స్థాయి గ్రూప్స్ పరీక్షలైనా పోటీ తీవ్రంగా ఉంటుందని సాయి శివాని తెలిపారు. ఇలాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కచ్చితంగా క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలని సూచించారు. ప్రతిరోజూ కష్టపడి చదవాలని, ఆదివారం, సోమవారం అనే తేడా లేకుండా నిరంతర సాధన కొనసాగించాలని చెప్పారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరమేనని, అయితే ఆ విరామాలు ఎక్కువ సమయం కొనసాగకుండా చూసుకోవాలని సూచించారు. ముందుగానే షెడ్యూల్ రూపొందించుకుని, దాని ప్రకారం చదువును పూర్తి చేయాలని యువతకు సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేయడమే లక్ష్యం

యూపీఎస్సీ ద్వారా సాధించిన విజయాన్ని ప్రజాసేవకు ఉపయోగించుకోవాలనేది తన లక్ష్యమని సాయి శివాని తెలిపారు. సర్వీసులోకి వెళ్లిన తర్వాత సమర్థవంతమైన అధికారిగా ఎదగడంతో పాటు ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి అవసరమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తానని చెప్పారు. సాయి శివాని సాధించిన విజయంపై ఆమె తల్లి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మొదట్లో 50 నుంచి 100 మధ్య ర్యాంకు వస్తుందని అనుకున్నామని, కానీ 11వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంట్లోనే ఉంటూ శివాని ఎంతో కష్టపడి చదివిందని, ఆమె పడిన శ్రమ తనకు తెలుసని చెప్పారు. ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఒకే రోజు రెండు సెషన్లలో కలిపి ఆరు గంటల పాటు పరీక్ష రాయాల్సి ఉంటుందని, పరీక్షల సమయంలో చేతికి నొప్పి వచ్చినా ఆమె పట్టుదలతో రాసేదని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన కూతురు పడిన కష్టాన్ని దగ్గరుండి చూశానని భావోద్వేగానికి గురయ్యారు.

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సాయి శివాని, ఇంట్లోనే ఉంటూ క్రమశిక్షణతో ప్రిపరేషన్ కొనసాగించి ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆమె ప్రయాణం ఒక మంచి ఉదాహరణ. లక్ష్యం స్పష్టంగా ఉండాలి.. కృషి నిరంతరంగా సాగాలి.. ఓటమి ఎదురైనా పట్టుదల తగ్గకూడదు. అప్పుడు విజయం తప్పకుండా వరిస్తుందని సాయి శివాని నిరూపించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us