జేబులో రూ.24 మాత్రమే.. KBCలో ఏకంగా రూ.కోటి గెలిచాడు! కూలీ కొడుకు సక్సెస్ స్టోరీ

చదువు కోసం తల్లి బంగారు నగలు అమ్మిన పరిస్థితి.. తండ్రి రెక్కల కష్టంతో పెరిగిన జీవితం.. జేబులో కేవలం రూ.24తో ముంబయికి ప్రయాణం.. పదేళ్ల నిరీక్షణకు కేబీసీ వేదికపై దక్కిన అద్భుత విజయం! పేదరికం ప్రతిభకు అడ్డుకాదని, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు నిరూపించాడు..

జేబులో రూ.24 మాత్రమే.. KBCలో ఏకంగా రూ.కోటి గెలిచాడు! కూలీ కొడుకు సక్సెస్ స్టోరీ
Labourers Son Wins Rs 1 Crore on KBC 18

Updated on: Nov 25, 2026 | 6:55 AM

చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, తల్లిదండ్రుల కష్టాలను దగ్గరగా చూస్తూ పెరిగిన భూషణ్ ఠాక్రే ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 18’ (KBC 18)లో ఏకంగా రూ.కోటి గెలుచుకుని ఈ సీజన్ తొలి కోటీశ్వరుడిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన విజయం వెనుక ఉన్న అసలు కథ తెలిస్తే ఎవరైనా భావోద్వేగానికి గురికావాల్సిందే. తాను సంపాదించిన డబ్బుతో తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని, ముఖ్యంగా తన చదువు కోసం అమ్ముకున్న తల్లి బంగారు నగలను తిరిగి కొనివ్వాలని ఆయన కోరుకుంటున్నారు.

మహారాష్ట్రలోని చిన్న గ్రామం నుంచి కేబీసీ వేదిక వరకు..

భూషణ్ ఠాక్రే మహారాష్ట్రలోని జల్గావు జిల్లాకు చెందిన యువకుడు. రవేర్ తాలూకాలోని బల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబం కంటే కూడా తక్కువ ఆర్థిక స్థితిలో ఉన్న కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి రోజువారీ కూలీగా పనిచేసేవారు. పని దొరికిన రోజే ఇంటికి ఆదాయం వచ్చేది. పని లేని రోజుల్లో కుటుంబాన్ని నడిపించడం కూడా కష్టంగా ఉండేది. భూషణ్ తల్లి కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కూలీ పనులు చేసేవారు. తల్లిదండ్రులిద్దరూ కష్టపడుతూ భూషణ్‌తో పాటు ఆయన తమ్ముడి చదువుకు అవసరమైన ఖర్చులను సమకూర్చేవారు. కుటుంబం మొత్తం నెలవారీ ఆదాయం సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మాత్రమే ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదవడం భూషణ్‌కు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు చదువును మాత్రం ఆపలేదు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకున్నారు. తల్లిదండ్రుల ఆ ఆశయమే భూషణ్‌లో పట్టుదలను పెంచింది.

చదువు కోసం తల్లి బంగారు నగల త్యాగం..

భూషణ్ జీవితంలో అత్యంత భావోద్వేగమైన విషయం ఆయన తల్లి చేసిన త్యాగం. కుటుంబ అవసరాల మధ్య కూడా తల్లి తన సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ సుమారు 20 నుంచి 25 గ్రాముల బంగారాన్ని క్రమంగా కొనుగోలు చేశారు. అయితే భూషణ్ ఉన్నత చదువులు, హాస్టల్ ఖర్చులు, పోటీ పరీక్షల సన్నద్ధత కోసం డబ్బు అవసరమైనప్పుడు ఆ బంగారు నగలను అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. తన చదువు ఆగిపోకూడదని తల్లి తనకు ఎంతో ఇష్టమైన నగలను కూడా వదులుకున్నారు. ఆ విషయం భూషణ్ మనసులో బలంగా నిలిచిపోయింది. తన కోసం తల్లి చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. అందుకే కేబీసీలో కోటి రూపాయలు గెలిచిన తర్వాత తల్లికి మళ్లీ బంగారు నగలు కొనివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ లక్ష్యం.. ఇంటికి దూరంగా 18 నెలల ప్రయాణం!

భూషణ్‌కు చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఉంది. ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబ పరిస్థితులను మార్చాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 2020 నుంచి యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు సుమారు ఏడాదిన్నర పాటు ఇంటికి దూరంగా ఉన్నారు. భుసావల్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఒకానొక సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా తాను కూడా ఏదైనా పని చేసి కుటుంబానికి సహాయం చేయాలని భావించారు. గ్రామంలోని నది సమీపంలో పని చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే తండ్రి మాత్రం కుమారుడు కూలీ పనులు చేయడం ఇష్టపడలేదు. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని, చదువుపైనే దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ఈ ప్రోత్సాహం భూషణ్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

జేబులో కేవలం రూ.24.. అయినా కల మాత్రం కోటి రూపాయలది!

భూషణ్ కేబీసీ ప్రయాణం ఒక్కరోజులో ప్రారంభం కాలేదు. 2016లో 18 ఏళ్లు నిండినప్పటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపు పదేళ్ల పాటు నిరంతరంగా ప్రయత్నించారు. మొదటి నాలుగైదేళ్ల పాటు కనీసం ఆడిషన్స్‌కు పిలుపు కూడా రాలేదు. 2021 నుంచి పలుమార్లు ఆడిషన్స్‌కు హాజరయ్యే అవకాశం వచ్చినా ఎంపిక కాలేకపోయారు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు. ప్రతిసారీ కొత్త ఉత్సాహంతో ప్రయత్నించారు. ఇక కేబీసీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడంతో ముంబయికి బయలుదేరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ముంబయికి చేరుకున్న సమయంలో ఆయన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.24 మాత్రమే ఉన్నాయి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ తన కలను నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ముందుకు సాగారు. చివరకు పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. కేబీసీ హాట్‌సీట్‌పై కూర్చొని తన జ్ఞానంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కేబీసీ వేదికపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఎదురుగా చూసినప్పుడు భూషణ్ తీవ్రంగా నెర్వస్ అయ్యారు. తనలాంటి చిన్న గ్రామానికి చెందిన వ్యక్తికి అమితాబ్ బచ్చన్‌ను కలవడం కల నిజమైనట్లుగా అనిపించింది. అయితే అమితాబ్ బచ్చన్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటంతో ఆయనలోని భయం తగ్గింది. మొదట్లో ప్రశ్నలు సులభంగానే అనిపించినప్పటికీ, ఒక్కో ప్రశ్న కఠినంగా మారడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ తనకు అందుబాటులో ఉన్న లైఫ్‌లైన్లను తెలివిగా ఉపయోగించుకున్నారు. చివరకు కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చి ఈ సీజన్ తొలి కోటీశ్వరుడిగా నిలిచారు. ఆ తర్వాత రూ.7 కోట్ల ప్రశ్నను కూడా ప్రయత్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

కోటి రూపాయలతో ఏం చేయబోతున్నారు?

భూషణ్‌కు ఈ కోటి రూపాయలు కేవలం బహుమతి మాత్రమే కాదు. ఆయన కుటుంబానికి ఎన్నో సంవత్సరాల కష్టానికి దక్కిన ప్రతిఫలం. తన కుటుంబం సంపాదించే మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తే ఈ కోటి రూపాయలు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల సంపాదనతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.గెలుచుకున్న మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేయకుండా, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనుకుంటున్నారు. అంతేకాదు.. తన తల్లి కోసం బంగారు నగలు కొనివ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. తన చదువు కోసం తల్లి అమ్ముకున్న నగల స్థానంలో తిరిగి బంగారం కొనివ్వడం ద్వారా ఆమె త్యాగానికి తగిన గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారు. తండ్రి ఇకపై కూలీ పనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలని, తల్లి వైద్య ఖర్చులను కూడా చూసుకోవాలని భావిస్తున్నారు. అలాగే మంచి కోచింగ్ సెంటర్‌లో చేరి యూపీఎస్సీ సన్నద్ధతను కొనసాగించాలనుకుంటున్నారు.

భూషణ్ తన జీవితంలో ఎదుర్కొన్న మరో అనుభవం బంధువుల నుంచి ఎదురైన నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తల్లి వైద్య చికిత్స కోసం కేవలం రూ.1,000 అడిగినా కొందరు బంధువులు సహాయం చేయడానికి ముందుకు రాలేదని, ఫోన్ చేసినా స్పందించలేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ ఇప్పుడు కేబీసీలో కోటి రూపాయలు గెలిచిన తర్వాత అదే బంధువుల నుంచి అభినందన ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఆయన విజయం గురించి తెలిసిన గ్రామస్థులు కూడా తల్లిదండ్రులను అభినందించారు. భూషణ్ ఠాక్రే కథలో అత్యంత ముఖ్యమైన విషయం ఆయన సాధించిన కోటి రూపాయల విజయం మాత్రమే కాదు. పదేళ్ల పాటు ప్రయత్నించడం, ఎన్నిసార్లు విఫలమైనా వెనక్కి తగ్గకపోవడం, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకోవడం, కుటుంబ పరిస్థితులను మార్చాలన్న సంకల్పం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

యూపీఎస్సీ లక్ష్యాన్ని కూడా ఆయన వదులుకోలేదు. కేబీసీలో సాధించిన విజయం తనకు మరింత ఆర్థిక భరోసాను కల్పించిందని, ఇకపై చదువుపై మరింత దృష్టి పెట్టగలనని భావిస్తున్నారు. పేదరికం ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించదు.. అతని పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తల్లి బంగారు నగలను తిరిగి కొనివ్వాలన్న భూషణ్ ఆశయం.. తండ్రి కష్టానికి గౌరవం ఇవ్వాలన్న ఆయన సంకల్పం.. కోటి రూపాయల బహుమతి కంటే గొప్పవి. అందుకే భూషణ్ ఠాక్రే విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది!

Loading...
Unable to load recommendations.
Follow Us