TG DSC 2024 Qualified List: డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో సిత్రాలు.. మొదటి ర్యాంక్‌ వచ్చినా నో జాబ్‌! తమ కష్టాన్ని అమ్ముకున్నారంటూ ఆరోపణలు

|

Oct 09, 2024 | 8:28 AM

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ఈ రోజు డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్‌ ఉన్నా తమకు ఉద్యోగాలు రాలేదని, డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను పక్కనపెట్టి హడావిడిగా అర్హతలేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు..

TG DSC 2024 Qualified List: డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో సిత్రాలు.. మొదటి ర్యాంక్‌ వచ్చినా నో జాబ్‌! తమ కష్టాన్ని అమ్ముకున్నారంటూ ఆరోపణలు
TG DSC 2024 Qualified List
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ఈ రోజు డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందించబోతున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరోవైపు అదే నియామకాల ప్రక్రియలో మెరిట్‌ ఉన్నా తమకు ఉద్యోగాలు రాలేదని, డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను పక్కనపెట్టి హడావిడిగా అర్హతలేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారంటూ పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. మొదటి ర్యాంకు సాధించినా తాము అర్హులుకారని డీఈవోలు వెనక్కి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి చదివినా లాభం లేదని.. ఉపాధ్యాయ కొలువు చేయాలనుకున్న తమకు నిరాశను మిగిల్చారంటూ కంటతడి పెడుతున్నారు. డీఈఓ కార్యాలయంలో అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించి అర్హులకు కాకుండా డబ్బులు ముట్టచెప్పిన వారికి పెద్దపీట వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది.

బోళ్ల రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి నాన్‌ లోకల్‌ కింద స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ తెలుగు మీడియంలో మొదటి ర్యాంకు సాధించాడు. అన్‌ రిజర్వ్‌డ్‌ పోస్టులో అతడికి కేటాయించాల్సిన ఉద్యోగాన్ని అధికారులు మరొకరికి కేటాయించినట్లు హైదరాబాద్‌ విద్యాశాఖ అధికారి రోహిణికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇలా రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాదు చాలా మంది తమకు అన్యాయం జరిగిందని డీఈవోలకు దరఖాస్తుల రూపంలో మొరపెట్టుకుంటున్నారు. కాగా హైదరాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు 616 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి బుధవారం ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. అయితే హైదరాబాద్‌లో మొత్తం 878 పోస్టులకుగాను 262 పోస్టులను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక చేపట్టలేదు. ఉర్దూ మీడియం రిజర్వేషన్‌ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇన్‌సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 8 మంది అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్టు కొర్రి పెట్టారు. దీంతో సదరు అభ్యర్థులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. పరీక్షల విభాగం ముందుగానే తమను నిరాకరించాల్సిందని, పరీక్షకు అనుమతించి ర్యాంకులు వచ్చాక ఇప్పుడు ఇన్‌సర్వీస్‌ అని ఇబ్బందులు పెట్టడం సరికాదని వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎల్‌పీ హిందీ విభాగంలో మూడు జనరల్‌, ఒక ఎస్సీ రిజర్వ్‌ మొత్తం నాలుగు పోస్టులుండగా.. 1:3 ప్రకారం 12 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలవగా 8 మంది హాజరయ్యారు. 3వ ర్యాంకులో ఉన్న రవికుమార్‌కు ఈ పోస్టుకు అవసరమైన అర్హత లేకపోయినా తుది జాబితాలో పేరు చేర్చడం ఆందోళనకు దారి తీసింది. 5వ ర్యాంకు సాధించిన భారతి, ఆమె భర్త నర్సింగ్‌ డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి పీఆర్‌టీయూ, తపస్‌ నాయకులు మద్దతు తెలిపారు. రవికుమార్‌ బంధువు ఒకరు బేరసారాలు నడిపినట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీకి రిజర్వ్‌ అయిన స్థానంలో 14వ ర్యాంకు అభ్యర్థి భారతి నాట్‌ విల్లింగ్‌ ఇచ్చినా ఆమెను 1:1 జాబితాలో చేర్చడంతో 30వ ర్యాంకు సాధించిన జె.ఉమ ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

ఎస్‌ఏ (బయోసైన్స్‌) విభాగంలో 15 పోస్టులుండగా.. 45 మందికిగాను 43 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. రోస్టర్‌ విధానంలో మొదటి 15 ర్యాంకుల్లో రెండు ఎస్సీకి ఉండగా.. నోటిఫికేషన్‌లో మూడు ఎస్సీకి రిజర్వు చేసినట్లు ప్రకటించారు. మూడోదాన్ని 43వ నంబర్‌లో ఉన్న నర్సింహులుకు కాకుండా 258వ ర్యాంకు సాధించిన శివకు ఇచ్చారు. అయితే ఈయన వీహెచ్‌ కోటాలో సీటు పొందాల్సి ఉన్నా.. ఎస్సీలో కేటాయించి వీహెచ్‌ను భర్తీ చేయకుండా వదిలేశారు. దీనిపై రాద్దాంతం జరిగింది. ఎస్‌ఏ తెలుగు, సోషల్‌ రెండు విభాగాల్లో పరీక్ష రాసిన కవిత, తిమ్మప్ప రెండింటిలోనూ 1:1కు అర్హులు. వారిద్దరు సోషల్‌ విభాగంలో ఉద్యోగం పొందాలని భావిస్తే వారి పేర్లను తెలుగులో చేర్చారు. రెండింటికి ఎంపికై న వారి నుంచి విల్లింగ్‌ లెటర్లు తీసుకోకుండా డీఈఓ కార్యాలయ అధికారులకు నచ్చినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఎల్‌పీ తెలుగులో ఎంపికై న ఇద్దరు అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు రాకపోయినా వారి పేర్లను తుదిజాబితాలో చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.