Grading System in Education: ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులతో పాసవ్వడమే గగనమైపోయేది. ఫస్ట్ క్లాస్‌లో పాసైతే వాటినే డివిజన్ మార్కులుగా పరిగణించి విద్యార్ధుల తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. కానీ గత కొంత కాలంగా విద్యావ్యవస్థలో ఈ ట్రెండ్ మారిపోయింది. బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత 99.9 శాతం మార్కులతో పాసయ్యే విద్యార్ధుల సంఖ్య చూస్తే మతిపోయినంత పనవుతుంది. పేరు గాంచిన కాలేజీల్లో చదివే విద్యార్ధుల్లోఒకరిద్దరుకాకుండా ఏకంగా వందల వేల మంది విద్యార్ధులు అధిక కటాఫ్‌తో పాసవ్వడం నేడు పరిహాసంగా మారింది. నిజానికిది ఆలోచించదగిన విషయం.
ఎంత తెలివైన విద్యార్ధైన పరీక్షల్లో పర్ఫెక్టుగా రాయలేరనేది జగమెరిగిన సత్యం. ఆర్ట్స్, సైన్స్, ల్యాంగ్వేజ్.. ఏ సబ్జెక్టు తీసుకున్నా పర్ఫెక్టుగా రాయడం అనేది దాదాపు అసాధ్యం. ఎస్సే లేదా లిటరేచర్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం తెల్పడంలో విద్యార్ధుల సామర్థ్యంలో తేడాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ విధమైన మార్కులను చాలా అరుదుగా మాత్రమే.. అదీ మేధావులై పిల్లలకు కేటాయించడం జరుగుతుంది. కేవలం 16 యేళ్ల వయసులో ఇంగ్లిష్ సబ్జెక్టులో షేక్‌ష్పియర్, ఎకనామిక్స్‌లో మాల్థస్, ఫిజిక్స్‌లో ఐన్‌స్టిన్ స్థాయిలో పరీక్షలు రాయలేరు. అవాస్తవమైన మూల్యాంకన పద్ధతుల వల్ల పిల్లలు వాస్తవికతకు దూరం అవుతారు. వైరుధ్యాలను అంచనావేయకపోతే దీర్ఘకాలంలో యువతపై చెడు ప్రభావం పడుతుంది. మార్కులు 90, 80లలో పొందిన విద్యార్ధులకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వారిలోని నిజమైన ప్రతిభ, అభిరుచికి తగ్గట్టుగా కాకుండా తమ మార్కులకు తగిన విధంగా కోర్సును ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది యువత భవిష్యత్తుకు తీరని నష్టం చేకూరుస్తుంది.
ఈ విద్యాపరమైన కుట్రకు ఆజ్యం పోసినవారు సాక్షాత్తు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు, తల్లిదండ్రులు, ప్రభుత్వ ఏజెన్సీలు, పరీక్ష బోర్డులు కావడం విచారకరం. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన విషయం. 89 శాతం మార్కులు సాధిస్తే పేరుగాంచిన విద్యాసంస్థల్లో సీటు పొందవచ్చని అనుకుంటున్నారు. 70వ దశకంలో చదువుకున్నవారి పరిస్థితేంటి? పరీక్షల్లో ఈ మాత్రం మార్కులు సాధించడానికి తలకిందులయ్యేవారు. విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసం, పాఠ్యేతర సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మార్కింగ్ సిస్టమ్‌లో ఎటువంటి పాత్ర లేకపోవడం నిజంగా విచారకరం. ఇది ఇలాగే కొనసాగితే.. రేపటి తరం వారు మరొక అడుగు ముందుకేసి 100కి 100 శాతం మార్కులు సాధించినా.. ఆశ్చర్యం లేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.