
హైదరాబాద్, నవంబర్ 5: నేటి కాలంలో పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు మరింత భారంగా మారుతుంది. ముఖ్యంగా హైదరబాద్ నగరంలోని పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌లలో ఫీజుల దందా చూస్తే మతిపోతుంది. లక్షల్లో ఫీజులు వసూలు చేయడమేకాకుండా చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, ఇండిపెండెన్స్ డే వంటి కల్చరర్ యాక్టివిటీస్‌లకు కూడా ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు. తాజాగా నగరంలోని ఓ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ యవ్వారం బయటకు రావడంతో.. అదికాస్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అసలు ముచ్చట ఏమంటే..
నగరంలోని పేరుగాంచిన ఓ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఈ ఏడాది నవంబర్ 14కి చిల్ట్రన్స్ డే నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ లీగ్ నిర్వహణకు సదరు ఇంటర్నేషనల్ స్కూల్ విడుదల చేసిన ప్రత్యేక సర్క్యులర్‌లో 4 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించింది. అథ్లెటిక్స్ పోటీలు నవంబర్ 7, 2026న, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ పోటీలు నవంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు అందులో ప్రకటించింది. ఈ పోటీల్లో స్కూల్‌లో చదువుతున్న బాలురు, బాలికలు పాల్గొనే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 31, 2026గా పేర్కొన్నారు.
అయితే నవంబర్ 7న నిర్వహించే అథ్లెటిక్స్‌లో 60 మీటర్లు, 80 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుతో పాటు 4×100 మీటర్ల రిలే, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో వంటి పోటీలు ఉన్నాయి. వివిధ వయస్సుల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వ్యక్తిగత అథ్లెటిక్స్ ఈవెంట్‌కు ఒక్కో విద్యార్ధికి రూ.300 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు. 4×100 మీటర్ల రిలేకు ఒక్కో జట్టుకు రూ.800 వసూలు చేస్తున్నారు. జావెలిన్ త్రోకు సంబంధించిన వయస్సు విభాగాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. నవంబర్ 11, 12 తేదీల్లో బాలురు, బాలికలకు ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 10, అండర్ 12, అండర్ 14, అండర్ 16 విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో ప్రతి జట్టుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.3,200 నిర్ణయించారు.
అదే తేదీల్లో బ్యాడ్మింటన్ పోటీలు కూడా నిర్వహించనున్నారు. అండర్-9, 11, 13, 14, 15 వయస్సుల విభాగాల్లో బాలురు, బాలికలకు అవకాశం కల్పించారు. సింగిల్స్ విభాగానికి రూ.600, డబుల్స్ విభాగానికి రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు. పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల అందించిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫీజు చెల్లించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. చెల్లింపు చేసిన తర్వాత స్క్రీన్‌షాట్‌ను పంపించేందుకు పాఠశాల వాట్సాప్ నంబర్‌ను సైతం అందులో సూచించారు.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు నగరంలోని పలు పాఠశాలలు వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయని, అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఫీజులు పై విధంగా వసూలు చేస్తున్నారు. క్రీడలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ఫీజులు తీసుకుంటున్నామని పాఠశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే బుక్స్ ఫీజులు, అడ్మిషన్, ట్యూషన్, కల్చరర్ యాక్టివిటీస్, ట్రావెలింగ్, లంచ్, స్నాక్స్, స్టడీ.. అంటూ లక్షల్లో దండుకుంటున్న కొన్ని స్కూళ్లు తాము నిర్వహించే ఫంక్షన్లకు కూడా హద్దుకు మించి విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచే ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి, విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వడం, పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఈ పేరుతోనూ విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా శిక్షణ అవసరమని చెబుతూ పాఠశాలలు ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నాయని, కొన్ని చోట్ల ఈ మొత్తం తల్లిదండ్రులకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ ఈవెంట్ల పేరుతో ఎంత ఫీజు వసూలు చేయాలి? వాటికి సంబంధించిన ఖర్చుల వివరాలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత ఉండాలని కోరుతున్నారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఇటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడం ఎంత ముఖ్యమో.. ఆ పేరుతో తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.