ఇంట్లో పరీక్ష రాస్తే 96%, క్లాస్‌రూమ్‌లో 48% మార్కులు..! అసలు విలన్ ఎవరో తెలిస్తే షాక్..

ఓ యూనివర్సిటీ పరీక్షల్లో విద్యార్ధులు చూపిన ప్రతిభ ప్రొఫెసర్ ను అమితాశ్చర్యానికి గురి చేసింది. అందుకు కారణం ఇంటికి వద్ద నిర్వహించిన కఠిన పరీక్షలో 100కి 100 మార్కులు తెచ్చుకుంటే.. వర్సిటీలో నిర్వహించిన సులువైన పరీక్షలో సగానికిపైగా ఫెయిల్ అయ్యారు. విద్యార్ధుల మార్కుల్లో వచ్చిన ఈ భారీ మార్పులు ప్రస్తుతం సర్వత్రా చర్చణీయాంశంగా మారాయి..

ఇంట్లో పరీక్ష రాస్తే 96%, క్లాస్‌రూమ్‌లో 48% మార్కులు..! అసలు విలన్ ఎవరో తెలిస్తే షాక్..
Brown University Exam AI Assisted Cheating

Updated on: Jul 10, 2026 | 6:32 PM

అమెరికాలోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన ఉన్నత విద్యలో AI వినియోగంపై కొత్త చర్చకు తెరలేపింది. ఇంటి వద్ద రాసిన పరీక్షలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగా, అదే సబ్జెక్టుకు నిర్వహించిన ప్రత్యక్ష (ఇన్-పర్సన్) తుది పరీక్షలో మార్కులు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో ఏఐ ఆధారిత అకడమిక్ మోసాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాబర్టో సెర్రానో అనే టీచర్‌ ECON 1170 కోర్సును బోధిస్తున్నాడు. ఆయన నిర్వహించిన పరీక్షలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఈ కోర్సులో సుమారు 30 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మిడ్‌టర్మ్, ఫైనల్ పరీక్షలను ఇంటి వద్ద రాసే విధంగా కోర్సును డిజైన్‌ చేశామని వర్సిటీ ప్రకటించడంతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 86కు పెరిగింది.

2026 మార్చిలో నిర్వహించిన మిడ్‌టర్మ్ పరీక్షలో విద్యార్థుల సగటు మార్కులు 100లో 96గా నమోదయ్యాయి. అంతేకాకుండా 40 మంది విద్యార్థులు పూర్తిగా 100కి 100 మార్కులు సాధించారు. అయితే పరీక్ష ప్రశ్నాపత్రం గతంతో పోలిస్తే మరింత కఠినంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి ఫలితాలు రావడం ప్రొఫెసర్‌ను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థుల సమాధానాల్లో అసాధారణమైన శైలి, క్లిష్టమైన భాష, అలాగే ChatGPT వంటి ఏఐ సాధనాలు ఇచ్చే సమాధానాలతో పోలికలు కనిపించాయని ఆయన గుర్తించారు. దీంతో విద్యార్థులు ఏఐను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తుది పరీక్షను ప్రత్యక్ష పద్ధతిలో యూనివర్సిటీలోనే నిర్వహించాలని సెర్రానో నిర్ణయించారు. ఫైనల్ పరీక్ష నిర్వహించిన తర్వాత దీని ఫలితాలు మిడ్‌టర్మ్ ఫలితాలకు పూర్తిగా భిన్నంగా వస్తే మిడ్‌టర్మ్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గిస్తామని కూడా ముందుగానే ప్రకటించారు.

ఈ నిర్ణయం అనంతరం 18 మంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే వదిలేయగా, మరో 9 మంది తుది పరీక్షకు హాజరు కాలేదు. ఇక ఫైనల్ పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల సగటు మార్కులు కేవలం 48 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇది మిడ్‌టర్మ్‌లో వచ్చిన సగటు మార్కుల కంటే సగం కూడా నమోదుకాలేదు. కాగా బ్రౌన్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. 67 శాతం గ్రాడ్యుయేట్, మెడికల్ విద్యార్థులు, 56 శాతం అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రతి రోజు లేదా ప్రతి వారం జనరేటివ్ ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే ఏఐపై అధిక ఆధారపడటం వల్ల అభ్యాస సామర్థ్యం, ఆలోచనా శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అకడమిక్ మోసాలను అరికట్టేందుకు విశ్వవిద్యాలయాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ సెర్రానో అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఏఐ సహాయంతో పరీక్షల్లో మోసం చేయడాన్ని సాధారణంగా భావిస్తే.. అది భవిష్యత్తులో సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

Follow Us