వ్యక్తి వికాసానికి, సమాజ అభ్యున్నతికి చదువు ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే వారి కుటుంబాలు ఉన్నతి సాధిస్తాయి. ప్రభుత్వాలు కూడా చదువుకు అనేక ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఫౌండేషన్ తన ఎస్బీఐ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ మూడవ ఎడిషన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పదివేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనుంది. ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అంటే పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రీమియర్ సంస్థలలో చదువుతున్న వారికి అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం రూ.15 వేల నుంచి రూ.2 లక్షల వరకూ స్కాలర్ షిప్ అందజేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ ఒకటో తేదీ వరకూ గడువు ఉంది. దరఖాస్తు ఫారంతో అన్ని వివరాలు sbifashascholarship.orgలో అందుబాటులో ఉన్నాయి.
దేశంలోని ప్రీమియర్ విశ్వవిద్యాలయాలు / కళాశాలల నుండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. గత ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదు. వీరిలో రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బాలికల కోసం 50 శాతం స్లాట్లు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులకు ప్రాధన్యత. ఎంపికైన విద్యార్థులకు రూ.50 వేలు ఉపకార వేతనం అందిస్తారు.
దేశంలోని విశ్వవిద్యాలయాలు/కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థుల స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. రూ.3 లక్షల ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. మహిళలకు 50 శాతం కేటాయించారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 70 వేల స్కాలర్ షిప్ అందిస్తారు.
దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. ఉత్తీర్ణతా శాతం, కుటుంబ ఆదాయం, మహిళలకు కేటాయింపులు పైన తెలిపిన విధంగానే ఉంటాయి. స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన విద్యార్థులు రూ.2 లక్షల స్కాలర్ షిప్ పొందవచ్చు.
దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుంచి ఎంబీఏ/పీజీడీఎం కోర్సులు అభ్యసించే విద్యార్థులు దీనికి అర్హులు. ఉత్తీర్ణతా శాతం, కుటుంబ ఆదాయం, మహిళలకు కేటాయింపులు పైన తెలిపిన విధంగానే ఉంటాయి. ఎంపికైన విద్యార్థులు రూ. 7.50 లక్షల వరకూ పొందవచ్చు.
ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్థి చదువు, ఆర్థిక అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన తర్వాత, స్కాలర్‌షిప్ మొత్తం నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..