Stock Market: భారత స్టాక్‌మార్కెట్లకు మరో ‘బ్లాక్‌ మండే’.. మూడేళ్ల పరుగులకు ఒక్కసారిగా బ్రేక్

|

Aug 05, 2024 | 9:43 PM

15 లక్షల కోట్ల రూపాయలు. చూస్తుండగానే ఇన్వెస్టర్ల సంపదంతా ఆవిరైపోయింది. బేర్‌ దెబ్బకు దలాల్‌ స్ట్రీట్‌ మొత్తం షేక్‌ అయింది. జపాన్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయాలు.. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు.. యుద్ధభయాలు.. ఇవన్నీ ప్రపంచ స్టాక్‌మార్కెట్లను కుదిపేశాయి. భారత స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ మండేని మిగిల్చాయి. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉండొచ్చు..? మార్కెట్లు కుదురుకునేదెప్పుడు?

Stock Market: భారత స్టాక్‌మార్కెట్లకు మరో బ్లాక్‌ మండే.. మూడేళ్ల పరుగులకు ఒక్కసారిగా బ్రేక్
Stock Market
Image Credit source: Reuters/Francis Mascarenhas
Follow us on

ప్రపంచం తుమ్మితే భారత్‌కు జలుబు చేస్తుంది. సోమవారం నాటి స్టాక్‌మార్కెట్‌ పతనానికి కారణం ఇదే. అమెరికాలో మాంద్యం భయాలు, జపాన్‌లో పెరిగిన వడ్డీరేట్లు, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధ భయాలు, చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు, బ్రిటన్‌లో నిరుద్యోగం.. ఇవన్నీ దలాల్‌ స్ట్రీట్‌ను ఎత్తికుదిపేశాయి. అలాఇలా కాదు.. ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరైపోయింది. లాభాలే తప్ప నష్టాలు చూడని ఇండియన్‌ రిటైలర్లకు ఇది భారీ షాక్. దాదాపు మూడేళ్లుగా మన మార్కెట్‌ పెద్ద కరెక్షన్‌ను చూడలేదు. ఈస్థాయిలో స్టాక్స్‌ పడడం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లకు తెలీదు. మార్కెట్‌ పతనం అంటే ఏమిటో.. బ్లాక్‌ మండే అంటే ఎలా ఉంటుందో.. సోమవారం నాటి మార్కెట్‌ చూపించింది.

జపాన్‌లో వడ్డీరేట్లు పెరగడం ఇండియన్ స్టాక్‌మార్కెట్లను కుదిపేసింది. జపాన్‌లో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్న జపాన్‌ ఇన్వెస్టర్లు.. భారత్‌ సహా వివిధ దేశాల స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వడ్డీరేట్లు పెంచడం, బాండ్ల ద్వారా కూడా పెద్దగా లాభాలు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో.. మన మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎంతొచ్చినా చాలు అన్నట్టుగా స్టాక్స్‌ అమ్ముకోవడంతో భారత స్టాక్‌మార్కెట్లు ఢమాల్‌మన్నాయి.

ఆల్రడీ అమెరికా భయాలు వెంటాడుతున్నాయి. అగ్రరాజ్యం మరోసారి మాంద్యంలోకి జారుతోందనే సంకేతాలు కనిపించాయి. జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే తగ్గింది. నిరుద్యోగం 4.3 శాతానికి చేరుకుంది. ఇది రాబోయే మాంద్యానికి సంకేతం అని ఇన్వెస్టర్లు భావించారు. మున్ముందు వడ్డీరేట్ల విషయంలో ఫెడ్‌ ఏ నిర్ణయం తీసుకోబోతోందన్న భయాలు కూడా ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్ల పతనం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది.

చైనా ఎకానమీపై ప్రపంచ మార్కెట్లకు భయాలు పట్టుకున్నాయి. అక్కడి ప్రాపర్టీ సెక్టార్‌ దారుణంగా పడిపోయింది. నిరుద్యోగం కూడా పెరుగుతోంది. చైనీస్‌లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఎప్పటి నుంచో ఉన్న ఈ భయాలు.. మార్కెట్లు పడిపోవడానికి ఓ కారణమైంది. అటు బ్రిటన్‌ కూడా మాంద్యంలోకి జారిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రిటన్‌లో వడ్డీరేట్లు పెరుగుతుండడం, ఉద్యోగాలు లేకపోవడంతో ఆల్రడీ ఆ దేశం మాంద్యంలోనే ఉందంటూ ఎకనమిస్టులు చెబుతున్నారు.

మూడో ప్రపంచ యుద్ధం గానీ వస్తుందా అన్న అనుమానాలు భయాలుగా మారాయి. ఇజ్రాయెల్-ఇరాన్‌ మధ్య సోమవారం నుంచే యుద్ధం మొదలవుతుందని అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. ఈ ఎఫెక్ట్‌ ప్రపంచ మార్కెట్లలో కనిపించింది. నిజానికి ఇండియన్‌ స్టాక్‌మార్కెట్లు కొన్నాళ్లుగా పరుగులు తీస్తున్నాయి. బడ్జెట్‌ ఎలా ఉన్నా దలాల్‌ స్ట్రీట్‌ పెద్దగా కుంగిపోలేదు. నెగటివ్‌ న్యూస్‌కు కూడా రియాక్ట్ కాలేదు. ఒకానొక దశలో అమెరికా మాంద్యం, యుద్ధం వంటి వార్తలను కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్తోంది. బట్.. ఎక్కడో ఒక దగ్గర ఈ పెరుగుదలకు బ్రేక్‌ రావాలి. సరిగ్గా ఆ పాయింట్‌ కోసమే ఎదురుచూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఒకేసారి.. అమెరికా, జపాన్, బ్రిటన్, చైనా నుంచి నెగటివ్‌ న్యూస్ రావడం, దీనికి తగ్గట్టుగా యుద్ధ భయాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి వార్తలు వినిపించడంతో అమ్మకాలకు ఇదే సరైన సమయం అనుకున్నారు. ఫలితంగా.. సెన్సెక్స్‌ 2వేల 222 పాయింట్ల నష్టంతో 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పడిపోయి 24వేల 55 వద్ద ఆగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి