
Supreme Court: తాత నుంచి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలో మనవడికి పుట్టుకతోనే హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రికి వారసత్వంగా వచ్చిన ప్రతి ఆస్తిలోనూ మనవడికి సమాన వాటా ఉంటుందనే వాదన సరైనది కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
29 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ, జస్టిస్‌లు అగస్టిన్ జార్జ్ మసీహ్, సునీతా అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం, తన తండ్రి ఆస్తి పూర్వీకులది లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తి అని పేర్కొంటూ, దాని విభజన కోసం 1997లో కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇది కూడా చదవండి: Multibagger Stock: రూ.1 లక్షను రూ.6.5 లక్షలు చేసిన షేర్.. 2026లో ఏకంగా 500 శాతానికిపైగా రాబడి!
తమిళనాడుకు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సునీతా అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పు ఇచ్చింది. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి తన తాత ఆస్తి విభజన ద్వారా తన తండ్రికి వచ్చిన భూమిలో సగం వాటా కావాలని 1997లో కోర్టును ఆశ్రయించాడు. తండ్రి ఆ ఆస్తిని ఇతరులకు విక్రయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను గతంలో మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను తీవ్రంగా పరిశీలించిన సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ పిటిషన్‌ను పూర్తిగా డిస్మిస్ చేసింది.
ఈ కేసు 1997లో దాఖలైన ఒక వ్యాజ్యానికి సంబంధించినది. పిటిషనర్ మైనర్ కావడంతో భూమిలో సగం వాటా, స్వాధీనం కోరుతూ తన తల్లి ద్వారా ఈ దావాను దాఖలు చేశారు. ఆ భూమి పూర్వీకులదని, ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో భాగమని, అందువల్ల తన తండ్రితో పాటు తనకు కూడా జన్మహక్కు ఉందని అతను వాదించాడు. అయితే తాత మరణించిన అనంతరం 1956 హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఆస్తి క్లాస్-1 చట్టబద్ధ వారసులకు సంక్రమిస్తుందని, అలా పంపకాలు జరిగి తండ్రికి వచ్చిన వాటాపై ఆయనకు మాత్రమే సర్వహక్కులూ ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. క్లాస్-1 వారసుల జాబితాలో మనవడి పేరు నేరుగా ఉండదని, తాత ఆస్తి విభజన పూర్తయ్యాక అది ఉమ్మడి ఆస్తిగా పరిగణించలేరని కోర్టు వివరించింది. ఆ ఆస్తిని అమ్ముకోవడం లేదా మరెవరికైనా ఇవ్వడం అనేది తండ్రి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది.
హిందూ వ్యక్తిగత చట్టం ప్రకారం, 1956 చట్టం, తండ్రి బ్రతికి ఉండగా తాత ఆస్తిలో వాటా కోరే హక్కును మనవడికి కల్పించదని కోర్టు ఎత్తి చూపింది. వీలునామా లేకుండా మరణించిన హిందూ పురుషుడి ఆస్తి బదిలీని నియంత్రించే ఒక స్వతంత్ర నిబంధనగా సెక్షన్ 8ని పరిగణించాలని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Biryani Business: రూ.99 బిర్యానీ.. ఓనర్‌కు రోజుకు ఎంత లాభం వస్తుంది? ఇలా చేస్తేనే సక్సెస్.. లేకుంటే నష్టమే..!
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఇక ఈ రైళ్లకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి