ఆభరణాల తర్వాత బంగారు నాణేలు, కడ్డీలను కూడా హాల్‌మార్క్ చేసే ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. బంగారు నాణేలు, కడ్డీల హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం కూడా నియమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన, కచ్చితమైన ఉత్పత్తులను ప్రజలకు అందించడం ద్వారా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘సీఐఐ జెమ్స్ అండ్ జువెలరీ సదస్సు’లో వినియోగదారుల కార్యదర్శి ఖరే అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రత్నాలు, ఆభరణాల రంగం మన ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన మూలస్తంభమని, ఇది ఎగుమతులు, ఉపాధి రెండింటికీ గణనీయంగా దోహదపడుతుందన్నారు.
40 కోట్లకు పైగా బంగారు ఆభరణాల గుర్తింపు:
జూన్ 23, 2021 నుండి ప్రారంభమైన బంగారు ఆభరణాలు, బంగారు కళాఖండాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం విజయవంతంగా అమలు చేయడం గురించి కూడా కార్యదర్శి ప్రస్తావించారు. 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు ప్రత్యేకమైన హెచ్‌యుఐడి (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్)తో హాల్‌మార్క్ చేయబడిందని, తద్వారా మార్కెట్‌లో వినియోగదారులకు ఎక్కువ నమ్మకం, పారదర్శకత ఉందని ఆయన అన్నారు. బంగారు నాణేలు, కడ్డీలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ఉందని, దానిని శాఖ పరిశీలిస్తోందని ఖరే చెప్పారు.
ఇది కూడా చదవండి: Indian Railways: హైపర్‌లూప్ రైలు.. విమానం కంటే స్పీడు.. గంటకు 1200 కి.మీ వేగం!
మార్కెట్ విలువ 134 బిలియన్ డాలర్లు
స్వర్ణకారులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఆ బంగారం నాణ్యత గురించి చాలాసార్లు వారికే తెలియకపోవడమే దీని వెనుక ఉన్న ఆలోచన అని ఆయన అన్నారు. భారతదేశ రత్నాలు, ఆభరణాల రంగం మార్కెట్ 2030 నాటికి 134 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇది 2023లో దాదాపు 44 బిలియన్ డాలర్లు. ప్రపంచ స్థాయిలో బంగారం ఎగుమతి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, ఇది దేశ మొత్తం ఎగుమతుల్లో 3.5 శాతంగా ఉందని వినియోగదారుల కార్యదర్శి తెలిపారు.
ఇది కూడా చదవండి: Women Schemes: మహిళల కోసం మోడీ సర్కార్ బెస్ట్ స్కీమ్.. వారి ఖాతాల్లో రూ.32 వేలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి