Indian Railways: భారత్‌లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’ రైలు..!

Vande Bharat Freight train: ఈ సరుకు రవాణా రైలు వినియోగం దేశంలో కాలపరిమితితో కూడిన డెలివరీలు, ఇ-కామర్స్ లాజిస్టిక్స్, తాజా సరుకుల సరఫరాలను గణనీయంగా మారుస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా, సురక్షితంగా, మరింత విశ్వసనీయంగా ఉంటుంది..

Indian Railways: భారత్‌లోనే తొలిసారి.. గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ కార్గో రైలు..!
Vande Bharat Freight Train

Updated on: Jul 30, 2026 | 2:10 PM

Vande Bharat Freight train: వందే భారత్ ప్యాసింజర్ రైళ్ల విజయం తర్వాత, ఇప్పుడు దేశంలో వందే భారత్ గూడ్స్ రైళ్లు కూడా పూర్తి వేగంతో ప్రయాణించనున్నాయి. వందే భారత్‌ గూడ్స్‌ రైలు ఏంటని అనుకుంటున్నారా? అవును నిజమే. సరుకు రవాణాను అత్యంత వేగవంతం చేసే దిశగా ఒక అడుగు వేస్తూ, దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ గూడ్స్ రైలు విజయవంతమైన ట్రయల్ రన్‌ను భారతీయ రైల్వే ప్రారంభించింది. వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే (WCR) ఇటీవల వందే భారత్ గూడ్స్ రైలు టెస్టింగ్‌కు సంబంధించిన ఒక వీడియోను పంచుకుంది. అందిన సమాచారం ప్రకారం, ట్రయల్ సమయంలో ఈ హై-స్పీడ్ గూడ్స్ రైలు గంటకు 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

అధికారుల ప్రకారం, ఈ ట్రయల్ జూలై 29న ప్రారంభమైంది. ఈ రైలు కోటా నుండి మహిద్‌పూర్ రోడ్‌కు బయలుదేరింది. వెళ్లే మార్గంలో గంటకు 120 కి.మీ, 135 కి.మీ వేగాన్ని అందుకున్న ఇది, తిరుగు ప్రయాణంలో గంటకు 145 కి.మీ వేగాన్ని కూడా చేరుకుంది.

ఇవి కూడా చదవండి

రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఈ ట్రయల్‌ను నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. వివిధ వేగాలతో వివిధ పరిస్థితులలో నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. దేశంలోనే మొట్టమొదటి 16-కోచ్‌ల వందే భారత్ ప్లాట్‌ఫామ్ ఆధారిత ఫ్రైట్ EMU నమూనా రైలు ఇదేనని కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ తెలిపారు.

 

సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే పూర్తిగా భిన్నమైనవి:

వందే భారత్ సరుకు రవాణా రైలు సాధారణ సరుకు రవాణా రైలుకు భిన్నంగా ఉంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ 16 కోచ్‌ల రైలులో 12 పార్శిల్ కోచ్‌లు, 2 కోల్డ్ స్టోరేజ్ కోచ్‌లు, 2 ఇతర కోచ్‌లు ఉన్నాయి. దీని మొత్తం పేలోడ్ సామర్థ్యం 397.02 టన్నులు. పండ్లు, కూరగాయలు, మందులు వంటి త్వరగా పాడైపోయే వస్తువుల కోసం ఇందులో రిఫ్రిజిరేటెడ్ పార్శిల్ సౌకర్యాలను కల్పించారు. ఇది కాకుండా, సరుకులను సులభంగా ఎక్కించడానికి, దించడానికి ఇందులో సీసీటీవీ, అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థ, ఫోర్స్ వెంటిలేషన్, ఎయిర్-లిఫ్టింగ్ రోలర్ ఫ్లోర్‌లను ఏర్పాటు చేశారు. రైలు వేగం గంటకు 5 కిలోమీటర్లకు చేరుకోగానే దాని తలుపులన్నీ వాటంతట అవే లాక్ అవుతాయి. అన్ని తలుపులు మూసేంత వరకు రైలు ముందుకు కదలదు.

ఈ సరుకు రవాణా రైలు వినియోగం దేశంలో కాలపరిమితితో కూడిన డెలివరీలు, ఇ-కామర్స్ లాజిస్టిక్స్, తాజా సరుకుల సరఫరాలను గణనీయంగా మారుస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా ఇప్పుడు మునుపెన్నడూ లేనంత వేగంగా, సురక్షితంగా, మరింత విశ్వసనీయంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? మరో రెండు రోజుల్లో ముగియనున్న గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..!

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us