House Construction: మీ ఇంటి గోడలు పగుళ్లు లేకుండా ఉండాలా? నిర్మాణంలో ఈ 5 ట్రిక్స్ పాటిస్తే చాలు..!
House Construction: ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే ముందే తుది ఫ్లోర్ ప్లాన్లు, వర్కింగ్ డ్రాయింగ్స్ సిద్ధంగా ఉండాలి. ఇది డోర్, విండో పొజిషన్స్, కొలతలు వంటి వాటిపై స్పష్టతను ఇస్తుంది. సరైన ప్రణాళిక లేకపోతే గోడలను పగలగొట్టి మళ్లీ నిర్మించాల్సి వస్తుంది (రీ-వర్క్)..

House Construction: కొత్తగా కట్టిన ఇళ్లలో సైతం కొద్ది సంవత్సరాల్లోనే గోడలకు పగుళ్లు రావడం, తడి చేరి పెయింట్ ఊడిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణంగా చూస్తుంటాం. దీనికి ప్రధాన కారణం నిర్మాణ దశలో నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం. మీ ఇంటికి ఇలాంటి సమస్యలు రాకుండా పటిష్టమైన గోడలను నిర్మించడానికి ఐదు కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు బిల్డర్లు, మేస్త్రీలు వారు తెలిపిన వివరాల ప్రకారం..
1. నాణ్యమైన మెటీరియల్ ఎంపిక:
- గోడ నిర్మాణానికి ఉపయోగించే ఇటుక, సిమెంట్, ఇసుక, నీరు నాణ్యత చాలా ముఖ్యం.
- ఇటుకలు: మంచి నాణ్యత గల ఇటుకలను ఎంచుకోవడం గోడ బలానికి మూలం. ఇటుకలను గోడలో పెట్టే ముందు కచ్చితంగా తడపాలి. లేకపోతే, ఇటుకలు మోర్టార్‌లోని నీటిని పీల్చుకొని, మోర్టార్ త్వరగా ఆరిపోయి హెయిర్‌లైన్ పగుళ్లకు దారితీస్తుంది.
- ఇసుక: నది ఇసుక వాడినప్పుడు, అందులో మట్టి కణాలు, పెద్ద రాళ్లు, ప్లాస్టిక్ లేదా గడ్డి వంటి సేంద్రీయ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇవి మోర్టార్ బలాన్ని తగ్గిస్తాయి.
- సిమెంట్: తయారీ తేదీని తప్పకుండా తనిఖీ చేయండి. రెండు-మూడు నెలల లోపు తయారుచేసిన సిమెంటునే కొనాలి. సిమెంట్ బ్యాగు తెరిచినప్పుడు గడ్డలు కట్టకుండా ఉండాలి. చేతితో తాకినప్పుడు చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే అలాంటి సిమెంట్ కొనకూడదు.
- నీరు: నిర్మాణం సమయంలో ఉప్పు నీటిని (సాల్ట్ వాటర్) అస్సలు ఉపయోగించకూడదు. సాల్ట్ వాటర్ వాడటం వల్ల గోడలపై తెల్లటి మరకలు, పెయింట్ పీల్ అవుట్ అవ్వడం, గోడలలో నిరంతరం తడి ఉండటం జరుగుతుంది. ఉప్పు నీటిలోని సోడియం కార్బోనేట్ వాతావరణంలోని తేమను నిల్వ ఉంచుకొని ఈ సమస్యలకు కారణమవుతుంది. ఇది ప్లాస్టరింగ్‌కు, ఇటుకల బలానికి నష్టం కలిగిస్తుంది. క్యూరింగ్, కాంక్రీట్, ప్లాస్టరింగ్, బ్రిక్ వర్క్ దేనికీ ఉప్పు నీటిని వాడకూడదు.
2. సరైన మోర్టార్ మిక్సింగ్ రేషియో:
- మోర్టార్ (సిమెంట్, ఇసుక మిశ్రమం) నిష్పత్తి గోడ బలానికి కీలకం.
- 4 అంగుళాల గోడకు 1:4 నిష్పత్తి (ఒక గోళం సిమెంట్: నాలుగు గోళాల ఇసుక) 9 అంగుళాల గోడకు 1:6 నిష్పత్తి నీటిని తగినంతగా మాత్రమే కలపాలి. మోర్టార్ మరీ పల్చగా లేదా మరీ పొడిగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఇటుకలు జారిపోవచ్చు. పొడిగా ఉంటే బంధం సరిగా ఏర్పడదు. మోర్టార్ మందం 10mm నుండి 15mm మించకుండా చూసుకోవాలి.
3. తుది ప్లాన్లు, వర్కింగ్ డ్రాయింగ్స్:
నిర్మాణాన్ని ప్రారంభించే ముందే తుది ఫ్లోర్ ప్లాన్లు, వర్కింగ్ డ్రాయింగ్స్ సిద్ధంగా ఉండాలి. ఇది డోర్, విండో పొజిషన్స్, కొలతలు వంటి వాటిపై స్పష్టతను ఇస్తుంది. సరైన ప్రణాళిక లేకపోతే గోడలను పగలగొట్టి మళ్లీ నిర్మించాల్సి వస్తుంది (రీ-వర్క్). దీనివల్ల నాణ్యత తగ్గుతుంది. ప్యాచ్‌లు సరిగా కలవక సమస్యలు వస్తాయి.
4. పటిష్టమైన పనితనం (ఎగ్జిక్యూషన్/వర్క్‌మెన్‌షిప్):
- ఎంత మంచి మెటీరియల్స్ వాడినా, ప్లాన్లు ఉన్నా, పనితనం సరిగా లేకపోతే అది వ్యర్థం.
- ఉపరితల తయారీ: గోడ కట్టే స్థలాన్ని (స్లాబ్) పూర్తిగా శుభ్రం చేయాలి. లూస్ మెటీరియల్స్ ఉంటే తొలగించి, నీటితో శుభ్రం చేసిన తర్వాత సిమెంట్ స్లర్రీని పోసి మొదటి పొరను వేయాలి. ఇది స్లాబ్, ఇటుక పని మధ్య మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది.
- కాలమ్ హ్యాచింగ్: కాలమ్స్ కు సరైన బంధం కోసం హ్యాచింగ్ చేయించాలి. ఆపై సిమెంట్ స్లర్రీ పోసి బ్రిక్ వర్క్ ప్రారంభించాలి.
- రోజువారీ ఎత్తు: ఒక రోజులో 1.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు గోడను కట్టకూడదు. ఎక్కువ ఎత్తు కడితే గోడ స్వంత బరువు పెరిగి ప్లంబింగ్ లో తప్పులు రావచ్చు, మోర్టార్ జారిపోవచ్చు లేదా పచ్చిగా ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కూలిపోయే అవకాశం ఉంటుంది.
- మెష్ వాడకం: పగుళ్లను నివారించడానికి వాల్, RCC జాయింట్లలో (నిలువు, అడ్డ జాయింట్లలో) ఫైబర్ లేదా స్టీల్ మెష్ ను తప్పకుండా వాడాలి. ఇది ప్లాస్టరింగ్ తర్వాత పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
5. తప్పనిసరి క్యూరింగ్:
- క్యూరింగ్ అనేది గోడ బలానికి అత్యంత కీలకమైన అంశం.
- గోడ కట్టిన తర్వాత కనీసం 7-10 రోజులు క్యూరింగ్ చేయాలి. వీలైతే 14 రోజులు చేస్తే మరింత మంచిది.
- క్యూరింగ్ చేయకుండా ముందుకు వెళ్లవద్దు. మేస్త్రీ తొందర పెట్టినా, సమయం లేకపోయినా క్యూరింగ్ విషయంలో రాజీ పడకూడదు.
- సరైన క్యూరింగ్ చేయకపోతే, మీరు ఎంత మంచి మెటీరియల్ వాడినా, ఎంత ప్రణాళికతో పని చేసినా అదంతా వృథా అవుతుంది. ఈ ఐదు ముఖ్యమైన జాగ్రత్తలను పాటిస్తే, మీ ఇల్లు పగుళ్లు, తడి వంటి సమస్యలు లేకుండా దశాబ్దాల పాటు పటిష్టంగా, అందంగా ఉంటుంది.
