మహిళల ఆర్థిక అభ్యున్నతికి, సంరక్షణకు ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి వారికి సైతం లబ్ధి చేకూరేలా వీటిని రూపొందిస్తున్నాయి. మహిళల్లో పొదుపును ప్రోత్సహించడం, తద్వారా వారికి కుటుంబానికి మేలు చేకూర్చడమే వీటి ఉద్దేశం. అందులో భాగంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. మహిళలు చాలా సులువుగా దీనిని మొదలు పెట్టవచ్చు. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్ లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలు, బాలికలలో పొదుపును ప్రోత్సహించేందుకు రూపొందించిన చిన్నపొదుపు పథకంగా దీన్ని చెప్పవచ్చు. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 జూన్ 7న ఈ-గెజిట్ విడుదల చేసింది. దాని ప్రకారం అన్ని ప్రభుత్వ బ్యాంకులు, అర్హత పొందిన ప్రైవేటు బ్యాంకులకు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్వీకరించడానికి, అమలు చేయడానికి అనుమతులు జారీ చేసింది. అర్హత కలిగిన షెడ్యూల్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ అనేది 2023 మార్చి నుంచి 2025 ఏప్రిల్ వరకూ నిర్ణీత వడ్డీ రేటులో అమలులో ఉండే వన్ టైన్ ప్రోగ్రాం. ఇందులో మహిళలు, బాలికల పేరు మీద గరిష్టంగా రూ.2 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం తపాలా శాఖ ద్వారా 2023 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది. ఆసక్తిగలవారు సమీపంలోని పోస్టాఫీసులను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ ను అనేక బ్యాంకులు అందజేస్తున్నాయి. మనకు అందుబాటులో ఉన్న బ్యాంకు అధికారులను సంప్రదించి వీటిని కొనుగోలు చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎంఎస్ ఎస్ సీ) పథకాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది. ఖాతాదారులతో పాటు ఖాతాదారులు కానివారు సైతం చేరవచ్చు. మహిళ తనపై పేరుపై తీసుకోవచ్చు. లేదా మైనర్లయిన అమ్మాయిల పేరుమీదా కొనుగోలు చేయవచ్చు.
కెనరా బ్యాంకు.. ఈ బ్యాంకు కూడా దేశంలోని తన అన్ని బ్రాంచ్ కార్యాలయాల్లో ఎం ఎస్ ఎస్ సీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే మహిళల అభ్యున్నతి రూపొందించిన ఈ పథకాన్ని అమలు చేయడం తమకు చాలా గర్వంగా ఉందని, మహిళల సాధికారతకు మద్దతు ఇవ్వడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని అధికారికంగా ట్వీట్ చేసింది. ఆసక్తి కలిగిన మహిళలు సమీపంలోని కెనరా బ్యాంకు శాఖల్లో సంప్రదించాలని సూచించింది.
బ్యాంకు ఆఫ్ ఇండియా.. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ను 2023లో ప్రారంభించిన మొదటి ప్రభుత్వం రంగ సంస్థ ఇదే. ఈ పథకాన్ని తమ అన్ని బ్యాంకు శాఖల్లోనూ అమలు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ).. పెట్టుబడిదారుల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ను విడుదల చేసిన మరో ప్రభుత్వ రంగ బ్యాంకు ఇది. ఈ మేరకు పీఎన్ బీ వెబ్ సైట్ లో వివరాలు వెల్లడించింది.
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. ఎం ఎస్ ఎస్ సీ పథకాన్ని ఈ బ్యాంకు దేశంలోని తన బ్రాంచ్ లలో 2023 జూన్ 30న ఖాతాదారులకు పరిచయం చేసింది. వీరి వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం 5653 మందికి సమ్మాన్ సర్టిఫికెట్లు పారంభించి 17.58 కోట్లు సేకరించింది.
సమ్మాన్ పథకం రెండు సంవత్సరాలు కాల వ్యవధితో వస్తుంది. అయితే ఖాతాదారులు ఏవైనా కారణాలతో తన ఖాతాను తెరిచినాటి నుంచి ఆరు నెలల తర్వాత రెండు శాతం పెనాల్టీతో ఖాతాను మూసేవేయవచ్చు. అప్పడు వడ్డీ రేటు 5.5 శాతం మాత్రమే చెల్లిస్తారు. అలాగే ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ఖాతాదారులు అందుబాటులో ఉన్న మొత్తంలో దాదాపు 40 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించిన నేపథ్యలో ఖాతాను మూసివేయవచ్చు. అలాగే ఖాతాదారుడికి ప్రాణాంతక అనారోగ్యం కలిగినా, సంరక్షకుడు చనిపోయినా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బందులతో ఖాతాలను మూసివేస్తే పథకం సాధారణ వడ్డీ రేటుగా 7.5 శాతం అందజేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..