
భారతదేశంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది నాణేలను ఎంచుకుంటారు. దుకాణానికి వెళ్లడం, నచ్చిన నాణేన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా సాధారణ విషయంగా కనిపిస్తుంది. అయితే, ఎలాంటి అవగాహన లేకుండా బంగారం నాణేలు కొనుగోలు చేస్తే అదనపు ఖర్చులు, తక్కువ రాబడులు వచ్చే ప్రమాదం ఉంది. గోల్డ్ కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.
అన్ని బంగారు నాణేలు ఒకేలా స్వచ్ఛత కలిగి ఉండవు. పెట్టుబడి కోణంలో కొనేవారు ఎప్పుడూ 24 క్యారెట్ల (999 లేదా 999.9 స్వచ్ఛత) బంగారు నాణేలను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి 99.9శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతను కలిగి ఉంటాయి. నాణేన్ని కొనుగోలు చేసేటప్పుడు సర్టిఫైడ్ డీలర్, ప్రసిద్ధ జ్యువెలర్ లేదా బ్యాంకుల నుండే కొనుగోలు చేయడం సురక్షితం. అలాగే తప్పనిసరిగా పక్కా బిల్లు, స్వచ్ఛతా ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి.
కొనుగోలుదారులు చేసే సాధారణ పొరపాటు కేవలం బంగారపు ముడి ధరను మాత్రమే చూడటం. గోల్డ్ కాయిన్స్‌పై తయారీ ఛార్జీలు, ప్యాకింగ్ ఖర్చులు అదనంగా కలుస్తాయి. ఉదాహరణకు, 5 గ్రాముల బంగారు నాణెం మార్కెట్ ధర కంటే కొంచెం ఎక్కువగా అమ్ముతారు. మార్కెట్ ధరకు, మీరు చెల్లించే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసమే ప్రీమియం. కాబట్టి వివిధ విక్రేతల వద్ద ధరలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.
బంగారం కొనడం ఎంత ముఖ్యమో, దానిని తిరిగి విక్రయించే విధానం కూడా అంతే కీలకం. కొన్ని నగల దుకాణాలు బై-బ్యాక్ సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్నింటిలో తరుగు లేదా ధర తగ్గింపులు ఉంటాయి. మీరు కొనుగోలు చేసే చోటే భవిష్యత్తులో దానిని తిరిగి తీసుకుంటారా లేదా అనే నిబంధనలను ముందే స్పష్టంగా తెలుసుకోవడం మంచిది.
భౌతిక రూపంలో బంగారం ఉంచుకోవాలనుకునే వారికి గోల్డ్ కాయిన్స్ మంచి మార్గమే అయినప్పటికీ, సరైన పరిశోధన చేసి, స్వచ్ఛత, అదనపు ఛార్జీలను బేరీజు వేసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.