పనిమనిషికి నెలకు రూ.లక్ష జీతం! పెద్ద పెద్ద చదువులు దండగేనా..
దుబాయ్‌లో గృహ సహాయకులకు భారీ డిమాండ్ ఉండటంతో నెలకు రూ.లక్ష వరకు జీతం లభించే అవకాశముంది. గంటల వారీగా 30 నుంచి 55 AED వరకు, పార్ట్‌టైమ్ సేవలకు నెలకు 900 నుంచి 1,750 AED వరకు చెల్లించాల్సి రావచ్చు. పూర్తి సమయం పనిచేసే వారికి అనుభవం, బాధ్యతలను బట్టి 1,500 నుంచి 4,000 AED వరకు జీతం ఉండొచ్చు.

సాధారణంగా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం, ఐదెంకెల జీతం వస్తుందని, లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చని చాలా మంది చెబుతుంటే వినే ఉంటారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోజంతా గొడ్డు చాకిరీ చేసినా చాలీచాలని జీతంతో ఎంతో మంది జీవితాన్ని భారంగా ఈడుస్తున్నారు. రూ.10, రూ.15 వేలకు కూడా 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నవారు నగరాల్లో కోట్ల మంది ఉన్నారు. పైగా వాళ్లలో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారే. అయినా కూడా వారి చదువు తగ్గ ఉద్యోగాలు లేక ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల మాత్రం చదువుతో సంబంధం లేకుండా, కేవలం ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
నెలకు లక్ష పైనే జీతం..
వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. ఇంట్లో వంట చేయడం, క్లీనింగ్ చేయడం వంటి పనులు చేస్తూ నెలకు లక్షపైనే సంపాదించుకునే అవకాశం ఉంది. పైగా పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. అన్నీ మిషన్లతోనే చేసేవచ్చు. అయితే పనిమనుషులకు ఇంత డిమాండ్ ఉంది మాత్రం మన దేశంలో కాదు దుబాయ్‌లో. దుబాయ్ అంటే విలాసవంతమైన జీవితం, భారీ భవనాలు, ఖరీదైన కార్లు, మెరుగైన సౌకర్యాలు గుర్తుకొస్తాయి. అయితే అక్కడి జీవన వ్యయంపై మాట్లాడేటప్పుడు మరో ముఖ్యమైన అంశం గృహ సహాయకుల ఖర్చు. ఇంటి పనిమనిషిని కొన్ని గంటల కోసం నియమించుకున్నా, పూర్తి సమయం పనిచేసే గృహ కార్మికురాలిని పెట్టుకున్నా ఖర్చు గణనీయంగానే ఉంటుంది.
గంటల్లో కూడా చెల్లిస్తారు..
దుబాయ్‌లో ఏజెన్సీ ద్వారా ఇంటిని శుభ్రం చేయించుకునే వారికి సాధారణంగా గంటకు 30 నుంచి 55 AED వరకు ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. 1 AEDను సుమారు రూ.23గా లెక్కిస్తే, గంటకు దాదాపు రూ.700 నుంచి రూ.1,250 వరకు ఖర్చవుతుంది. అంటే నాలుగు గంటల పాటు సేవలు తీసుకుంటే ఒక రోజుకు సుమారు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు చెల్లించాల్సి రావచ్చు. చిన్న 1 BHK ఇంటిని ఒక్కసారి సాధారణంగా శుభ్రం చేయించుకోవడానికి సుమారు 150 నుంచి 250 AED వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3,500 నుంచి రూ.5,700 వరకు అవుతుంది. ఇంటి విస్తీర్ణం, శుభ్రపరిచే పని, అదనపు సేవలను బట్టి ఈ ధరల్లో మార్పు ఉంటుంది.
నెలకు 8 నుంచి 12 సార్లు ఇంటిని శుభ్రం చేయించుకోవాలనుకునే వారికి కొన్ని సంస్థలు పార్ట్‌టైమ్ ప్యాకేజీలను అందిస్తాయి. వీటికి నెలకు సుమారు 900 నుంచి 1,750 AED వరకు ఖర్చవుతుందని సమాచారం. అంటే దాదాపు రూ.20,700 నుంచి రూ.40,000 వరకు అవుతుంది. ఇక పూర్తి సమయం పనిచేసే గృహ సహాయకురాలిని నియమించుకుంటే ఖర్చు మరింత పెరుగుతుంది. అనుభవం, పని బాధ్యతలు, పని గంటలను బట్టి నెలకు సుమారు 1,500 నుంచి 4,000 AED వరకు జీతం ఉండవచ్చు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.34,500 నుంచి రూ.1,00,000 వరకు ఉంటుంది.
ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..
అయితే ఇక్కడ జీతం మాత్రమే మొత్తం ఖర్చు కాదు. వర్తించే నిబంధనల ప్రకారం వీసా స్పాన్సర్‌షిప్, వైద్య బీమా, వసతి, ఇతర సంబంధిత ఖర్చులు కూడా యజమానిపై పడవచ్చు. వంట, పిల్లల సంరక్షణ, బట్టలు ఉతకడం వంటి అదనపు బాధ్యతలు ఉంటే ఖర్చు మరింత పెరగొచ్చు. అందువల్ల దుబాయ్‌లో గృహ సహాయకురాలిని నియమించుకునే ముందు గంటల వారీ సేవ అవసరమా, పార్ట్‌టైమ్ సేవ సరిపోతుందా, లేక పూర్తి సమయం సహాయం అవసరమా అనేది నిర్ణయించుకోవడం ముఖ్యం. అలాగే ఏజెన్సీ ఫీజులు, అదనపు సేవల ఛార్జీలు, సెలవులు, ఇతర చట్టపరమైన బాధ్యతలను కూడా ముందుగానే తెలుసుకోవాలి.
